టీడీపీ అధికారిక వెబ్‌సైట్ మూతపడిందా?
♦ 2015 అక్టోబర్ 14 నుంచి అప్‌డేట్ కాని వెబ్‌సైట్
♦ ఏపీలో ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ప్రచారాలు
♦ తెలంగాణ టీడీపీకి సమాచార లేమి
♦ ఎక్కడా కనిపించని గ్రేటర్ ఎన్నికల సమాచారం
సాక్షి, హైదరాబాద్: ‘‘సెల్‌ఫోన్‌ను హైదరాబాద్‌కు తెచ్చింది నేనే! దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చింది నేనే!! అందరి జాతకాలు నా ల్యాప్‌టాప్‌లో భద్రంగా ఉన్నాయి... బిల్‌గేట్స్, సత్య నాదెళ్ల నన్ను కలిసేందుకు అపాయింట్‌మెంటు అడుగుతారు..’’ అంటూ అధునాతన సాంకేతిక విప్లవంపై అలవిగాని మాటలు చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ అధికారిక వెబ్ సైట్‌ను అటకెక్కించినట్టున్నారు. ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రణాళికలు, నాయకుల టూర్ షెడ్యూల్స్, బాబు రోడ్‌షోల వివరాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను క్లిక్ చేసే తమ్ముళ్లు నిరుటి సమాచారం చూసుకొని తెల్లబోతున్నారు.
అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నట్టుగానే తెలుగుదేశం పార్టీకి అధికారికంగా ‘తెలుగుదేశం.ఓఆర్‌జీ’ డొమైన్‌తో ఓ వెబ్‌సైట్ ఉంది. 1998 మే 25న రిజిస్టర్ అయిన ఈ వెబ్‌సైట్ గత సంవత్సరాంతం వరకు చురుగ్గానే పనిచేసేది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నడిచినా, హెలికాప్టర్ ఎక్కినా... చివరికి ఇతర దేశాల పర్యటనకు వెళ్లినా వెబ్‌సైట్‌లో ఫొటోలు, వార్తా కథనాల క్లిప్పింగ్‌లు కనిపించేవి.
వెబ్‌లో అప్‌డేట్ కాని సమాచారం
అయితే ఏమైందో తెలియదు గానీ.. 2015 అక్టోబర్ 14 నుంచి ఈ వెబ్‌సైట్‌లో తెలుగుదేశం సమాచారం అప్‌డేట్ కావడం లేదు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ డొమైన్‌ను క్లిక్ చేయగానే లేటెస్ట్ న్యూస్ అనే ఆప్షన్ కింద ‘నేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు- 14.10.2015’ అని రాసిన క్యాప్షన్ కనిపిస్తుంది. అంటే అక్టోబర్ 14 నాటి వార్తా కథనాల క్లిప్పింగ్‌లను అప్‌లోడ్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ సిబ్బంది తరువాత ఈ సైట్‌ను చూడటమే మానేశారన్నమాట. దీనిపై పూర్తి సమాచారం తెలుసుకోగా 2016 మే 24 వరకు ఈ వెబ్‌సైట్ నిర్వహణకు చివరి గడువుగా తేలింది. ఆర్‌వీఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ద్వారా టి. శ్రీనివాస్‌రావు తెలుగుదేశం ఆఫీసు కేంద్రంగానే ఈ వెబ్‌సైట్‌ను రిజిస్టర్ చేసినప్పటికీ.. ఎందుకు అప్‌డేట్ చేయడం మానేశారనే సమాచారం లేదు. 37 రోజుల నుంచి డొమైనర్ సైట్‌ను ఓపెన్ చేయలేదని హు ఈస్ డాట్‌నెట్ ద్వారా తెలుస్తుంది.
కానరాని గ్రేటర్ ఎన్నికల సమాచారం
దేశానికి ఐటీని తీసుకొచ్చానని చెప్పుకొనే చంద్రబాబు సొంత పార్టీ వెబ్‌సైట్‌ను ఓ ప్రైవేటు కంపెనీ రిజిస్టర్ చేస్తే... 37 రోజులుగా సైట్‌ను ముట్టుకునే వారు లేరు. ఇక మూడు నెలల నుంచి సమాచారం అప్‌డేట్ కాకపోవడంతో ఈ సైట్‌ను చూసేవారు లేకుండా పోయారని తెలుస్తోంది. కాగా ఏపీలో చంద్రబాబుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రచారం చేస్తోంది. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం గతేడాది అక్టోబర్‌కు ముందు సమాచారాన్నే చూసుకునే పరిస్థితి నెలకొంది. తెలంగాణ తెలుగుదేశం నాయకులు గ్రేటర్ ఎన్నికల సమాచారం చూసుకుందామన్నా వెబ్‌సైట్ అప్‌డేట్ కాకపోవడంతో ఉసూరుమంటున్నారు.