సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచేందుకు కుట్రలు పన్నిందని టీడీపీ ఆరోపించింది. పాతబస్తీతోపాటు శివారు డివిజన్లలో టీఆర్‌ఎస్ నేతలు దాడులు చేసినా, విచ్చలవిడిగా డబ్బులు పంచినా అధికారులు చేష్టలుడిగిపోయారని విమర్శించింది.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్ మంగళవారం ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయని టీఆర్‌ఎస్ ఈసారి అధికార బలంతో మేయర్ స్థానంపై కన్నేసి అక్రమాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యవాదులు, నియంతల మధ్య ఎన్నికలు జరిగాయని, అయినా ఫలితం టీడీపీ, బీజేపీ కూటమికే అనుకూలమని పేర్కొన్నారు. పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనల వ ల్ల ఓట్లు రాలవనే విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టీడీపీ విజయాన్ని టీఆర్‌ఎస్, ఎంఐఎం ఆపలేవన్నారు.