
కోవిడ్-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. గృహ వినియోగదారులకు మద్దతుగా స్టాంప్ డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబర్‌వరకూ అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. కరోనా వైరస్ విస్తృతితో ఇటీవల డీలాపడ్డ రియల్టీకి మద్దతుగా స్టాంప్ డ్యూటీని తగ్గించమంటూ కొంతకాలంగా రియల్టీ కంపెనీలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తలతో ఒక్కసారిగా రియల్టీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగం 3.3 శాతం ఎగసింది. ప్రస్తుతం పలు కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
ర్యాలీ బాటలో
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో సన్‌టెక్ రియల్టీ 8.5 శాతం దూసుకెళ్లి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఒబెరాయ్ రియల్టీ 6.3 శాతం జంప్‌చేసి రూ. 390ను తాకగా.. ఇండియాబుల్స్ రియల్టీ 4.7 శాతం ఎగసి రూ. 73కు చేరింది. ఇతర కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.5 శాతం పెరిగి రూ. 889 వద్ద, శోభా లిమిటెడ్ 2.25 శాతం బలపడి రూ. 261 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదేవిధంగా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 2 శాతం పుంజుకుని రూ. 245 వద్ద, బ్రిగేడ్ 2 శాతం లాభంతో రూ. 175 వద్ద కదులుతున్నాయి. ఇక ఒమాక్స్ 1.2 శాతం పెరిగి రూ. 75ను అధిగమించగా.. ఫీనిక్స్ 0.7 శాతం బలపడి రూ. 655 వద్ద, డీఎల్‌ఎఫ్ 0.7 శాతం లాభపడి రూ. 161 వద్ద ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment