రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్‌లో మెంటార్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్‌లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.
ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్
గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్‌లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్‌లు రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్‌లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్‌కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్‌లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్‌లతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment