సూచీలకు రిలయన్స్‌ బలం | Reliance Industries breaks into top 50 most valued firms globally | Sakshi
Sakshi News home page

సూచీలకు రిలయన్స్‌ బలం

Published Fri, Jul 24 2020 5:10 AM | Last Updated on Fri, Jul 24 2020 5:11 AM

Reliance Industries breaks into top 50 most valued firms globally - Sakshi

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇచ్చిన మద్దతుతో దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం తిరిగి లాభాల బాట పట్టాయి. కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు జీవితకాల గరిష్టానికి (రూ.2,078.90) దూసుకుపోయింది. ఫలితంగా సెన్సెక్స్‌ 269 పాయింట్లు పెరిగి (0.71 శాతం) 38,140 పాయింట్ల వద్ద క్లోజ్‌ అవగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి (0.74శాతం) 11,215 వద్ద స్థిరపడింది. సూచీలకు వచ్చిన లాభాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాయే ఎక్కువగా ఉంది.

బుధవారం ఒక్క రోజు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్న సూచీలు, అంతక్రితం ఐదు రోజులు ర్యాలీ చేయడం గమనార్హం. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్‌ మహీంద్రా, ఐటీసీ, కోటక్‌ బ్యాంకు లాభపడగా.. యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అల్ట్రాటెక్‌ సిమెంట్, ఎల్‌అండ్‌టీ నష్టపోయాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీచడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు లాభాలతో ముగిశాయి.

చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలపై ఆందోళనల కంటే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తొందరగా వస్తుందన్న అంచనాలు, కంపెనీల ఫలితాలు ఆశించినదాని కంటే మెరుగ్గా ఉండడం అనుకూలించింది. ఐటీ మినహా చాలా వరకు సూచీలు లాభపడ్డాయి. మార్కెట్లు ఏ మాత్రం పడినా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది’’అంటూ జియోజిత్‌ ఫై నాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.  

మురిపించిన ‘రోసారి’ లిస్టింగ్‌
స్పెషాలిటీ కెమికల్స్‌ రంగంలోని రోసారి బయోటెక్‌ లిస్టింగ్‌ రోజే ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించింది. ఐపీవోలో భాగంగా ఒక్కో షేరును రూ.425కు కేటాయించగా, ఈ ధరపై 58 శాతం ప్రీమియంతో రూ.670 వద్ద బీఎస్‌ఈలో లిస్ట్‌ అయింది. ఇంట్రాడేలో రూ.804 వరకు వెళ్లి స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ అనుమతించిన గరిష్ట ధర రూ.804 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను కూడా తాకింది. చివరకు 75 శాతం లాభంతో రూ.742 వద్ద క్లోజయింది. ఈ ఐపీవోకు అద్భుత స్పందన వచ్చిన విషయం తెలిసిందే.  

రిలయన్స్‌ నాన్‌స్టాప్‌ ర్యాలీ
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌లో పెట్టుబడులకు అమెజాన్‌ ఆసక్తి చూపిస్తోందంటూ వచ్చిన వార్తలు స్టాక్‌ను నూతన గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.2,078.90 వరకు వెళ్లిన స్టాక్‌ చివరకు మూడు శాతం లాభపడి రూ.2,060.65 వద్ద క్లోజయింది. ఈ ఏడాది మార్చి 23న 867.82 కనిష్టాన్ని నమోదు చేయగా.. ఈ స్టాక్‌ కేవలం నాలుగు నెలల్లోనే 135 శాతం లాభపడడం గమనార్హం. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్‌లలో అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగ దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్, క్వాల్‌కామ్‌ తదితర కంపెనీలు  ఇన్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రపంచ టాప్‌–50లోకి రిలయన్స్‌
న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో గుర్తింపు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్‌ 50 కంపెనీల్లోకి ప్రవేశించింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13 లక్షల కోట్లను దాటిపోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ విలువ పరంగా 48వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా చూస్తే సౌదీఆరామ్‌కో 1.7 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ (సుమారు రూ.127 లక్షల కోట్లు)తో మొదటి స్థానంలో ఉండగా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్‌ స్టాక్‌ రూ.2,060.65 వద్ద క్లోజయింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13,06,329.39 కోట్లను చేరుకుంది. చైనాకు చెందిన ఆలీబాబా గ్రూపు 7వ స్థానంలో ఉంది. టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్‌ టాప్‌ 100లో నిలిచింది. టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.8.14లక్షల కోట్లుగా ఉంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement