న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫిక్సిడ్ లైన్ల విభాగంలోనూ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఆగస్టులో ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను తోసిరాజని అగ్రస్థానం దక్కించుకుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జియో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. మొత్తం వైర్‌లైన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య జూలైలో 2.56 కోట్లుగా ఉండగా ఆగస్టులో 2.59 కోట్లకు పెరిగింది.
బీఎస్‌ఎన్‌ఎల్ 15,734 మంది యూజర్లు, ఎంటీఎన్‌ఎల్ 13,395 మంది కస్టమర్లను కోల్పోయాయి. జియోకు 2.62 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 1.19 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు (వీఐ) 4,202, టాటా టెలీ సర్వీసెస్‌కు 3,769 మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం టెలికం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య స్వల్పంగా 117.36 కోట్ల నుంచి 117.5 కోట్లకు పెరిగింది. జియోకు కొత్తగా 32.81 లక్షలు, ఎయిర్‌టెల్‌కు 3.26 లక్షల మంది మొబైల్ యూజర్లు జతయ్యారు. వీఐ 19.58 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్ 5.67 లక్షలు, ఎంటీఎన్‌ఎల్ 470 మంది యూజర్లను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల విషయానికొస్తే 80.74 కోట్ల నుంచి 81.39 కోట్లకు చేరాయి. జియోకు అత్యధికంగా 42.58 కోట్ల మంది, ఎయిర్‌టెల్‌కు 22.39 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త
Comments
Please login to add a commentAdd a comment