న్యూఢిల్లీ: భారతదేశంలో 30 మిలియన్ డాలర్ల (రూ.246 కోట్లు) పైన నెట్‌వర్త్ ఉన్న అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య గత ఏడాది 7.5 శాతం తగ్గి 12,069కి చేరినట్లు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది. అయితే రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 19,119 పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ తెలిపారు.
ఇదే జరిగితే పెరుగుదల పరిమాణం 58.4 శాతమన్నమాట. ‘‘ది వెల్త్ రిపోర్ట్ 2023’’ శీర్షికన ఆయా అంశాలకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తాజా నివేదిక తెలిపిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే...
♦ భారత్ బిలియనీర్లు 2021లో 145 ఉంటే, 2022నాటికి 161కి పెరిగింది. 2027 నాటికి 195 మందికి ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా.
♦ దేశంలో మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగిన సంపన్నుల జనాభా 2021లో 7,63,674 ఉంటే, 2022లో 7,97,714కి పెరిగింది. 2027 నాటికి ఈ జనాభా 16,57,272కు చేరుతుందని అంచనా...
♦ భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 2022లో అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య 3.8 శాతం తగ్గింది. 2021లో మాత్రం 9.3 శాతం పెరిగింది.
♦ ఆర్థిక మందగమనాలు, తరచుగా రుణ రేట్ల పెంపుదల, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అత్యంత సంపన్నుల సంపద, పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ప్రభావితమవుతోంది.
♦ భారత్ విషయానికి వస్తే, వడ్డీరేట్ల పెరుగుదల, రూపాయిపై డాలర్ బలోపేతం వంటి అంశాలు వ్యక్తుల నెట్‌వర్త్ పెరుగుదలపై ప్రభావితం చూపిస్తోంది.
వృద్ధి బాట...
పారిశ్రామిక, పారిశ్రామికేతర రంగాలలో భారత్ ఇటీవల చక్కటి అభివృద్ధిని నమోదుచేసుకుంటోంది. ఆయా కార్యకలాపాలు ఇటీవలి కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో దోహదపడ్డాయి. కొత్త సంపదను సృష్టించే గ్లోబల్ స్టార్టప్ హబ్‌గా భారతదేశం కీలక స్థానంలో ఉంది.
దేశంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ స్టార్టప్‌లు మొదలైన రంగాల నుండి వెలువడుతున్న కొత్త అవకాశాలు ఆర్థిక ఊపును ప్రోత్సహిస్తున్నాయి. సంపద సృష్టికి దోహదపడతాయి, ఇవన్నీ భారత్‌లో అత్యంత సంపన్నుల సంఖ్య పెరగడానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment