ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆయన బాధ్యతలు ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకున్నారు.
సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది.
ఐటీ పరిశ్రమ ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయానికి బదులుగా సంస్కరణలను నమ్ముతుంది. అందులో భాగంగా పరిశోధనలను అందిపుచ్చుకుంటుదని సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సత్య మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికే 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా కంపెనీలోనే ఉన్నారు కదా..కొత్తగా ఏమి ఆవిష్కరిస్తారని చాలామంది అనుమానించారు.
బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే పెద్ద సవాలే. సత్య నాదెళ్ల చేసే ప్రతి పనిని, ప్రతి కదలికను ఆ ఇద్దరితో పోలుస్తారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు.
‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్‌లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్‌ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బి.డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అంతర్గతంగా ఉత్తమ ఫలితాలు సాధించడం కంటే, ప్రజలు-పరిశ్రమలో బ్రాండ్ బిల్డింగ్ వైపు మైక్రోసాఫ్ట్ ఎక్కువగా మొగ్గుచూపేది. ఆ వైఖరిని ఆయన పూర్తిగా మార్చారు.
పేరు: సత్య నారాయణ నాదెళ్ల
తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్
తల్లి: ప్రభావతి
భార్య: అనుపమ నాదెళ్ల
పిల్లలు: 3
కుమారుడు: జైన్ నాదెళ్ల
కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల
జన్మస్థలం: హైదరాబాద్
వయసు: 56 (2024)
జాతీయత: భారతీయుడు
పౌరసత్వం: యూఎస్‌ఏ
చదువు: మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ
వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్
డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో
Comments
Please login to add a commentAdd a comment