
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు (బీఎస్‌బీడీ) షాకిచ్చింది. ఇకపై ఏటీఎం నుంచైనా, శాఖ నుంచైనా నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా ఉంటాయని వెల్లడించింది. అలాగే, ఏడాదికి 10 చెక్ లీఫ్‌లకు మించి తీసుకుంటే కూడా అదనంగా చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ఈ పరిమితి దాటితే ‘అదనపు విలువ ఆధారిత సర్వీసులు అందించినందుకు‘ గాను రూ. 15 నుంచి రూ. 75 దాకా చార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది.
బీఎస్‌బీడీ ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఈ మేరకు సవరించింది. వీటి ప్రకారం .. ఎస్‌బీఐ శాఖలు, ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 4 ఉచిత నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు దాటితే రూ. 15 చార్జీలతో పాటు జీఎస్‌టీ అదనంగా వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. జూలై 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఆర్థికేతర లావాదేవీలు, ట్రాన్స్‌ఫర్ లావాదేవీలు మాత్రం శాఖలు, ఏటీఎం, సీడీఎం (క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్ల)లలో ఉచితంగానే ఉంటాయని ఎస్‌బీఐ వివరించింది.
అటు చెక్ బుక్ సర్వీసులకు సంబంధించి.. ఒక ఆర్థిక సంవత్సరంలో పది చెక్ లీఫ్‌లు ఉచితంగా ఉంటాయని తెలిపింది. అది దాటితే.. 10 లీఫ్‌ల చెక్ బుక్‌కు రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ. 75 చార్జీలు వర్తిస్తాయి. వీటికి జీఎస్‌టీ అదనం. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్‌టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మాత్రం చెక్ బుక్ సేవల పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. కస్టమర్ వివరాల ధ్రువీకరణ నిబంధనలకు (కేవైసీ) లోబడి ఎవరైనా బీఎస్‌బీడీ ఖాతా తీసుకోవచ్చు.
ప్రధానంగా ఎలాంటి చార్జీలు, ఫీజుల భారం పడకుండా బడుగు, బలహీన వర్గాలను పొదుపు వైపు మళ్లించేందుకు ఈ ఖాతాలను ఉద్దేశించారు. ఐఐటీ–బాంబే ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2015–20 మధ్య కాలంలో 12 కోట్ల బీఎస్‌బీడీ ఖాతాలపై సర్వీసు చార్జీలు విధించడం ద్వారా కస్టమర్ల నుంచి ఎస్‌బీఐ ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది.
చదవండి: Senior Citizens: బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్...!
Comments
Please login to add a commentAdd a comment