ముంబై: దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు గురువారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. కరోనా కేసుల కట్టడికి వచ్చే నెల(మే) ఒకటవ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను మెప్పించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా ఉదయం సెషన్‌లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 375 పాయింట్ల లాభంతో 48,081 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 110 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకొని 14,406 వద్ద నిలిచింది.
ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని చూపారు. మెటల్ షేర్లు కూడా రాణించి సూచీల ర్యాలీకి సహకరించాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభా ల్లో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 909 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.850 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఆరుపైసలు క్షీణించి 74.94 వద్ద స్థిరపడింది.
ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి...
కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలను దాటడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గు చూపడంతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది.సెన్సెక్స్ 204 పాయింట్ల నష్టంతో 47,502 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లను కోల్పోయి 14,219 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్లు దూకుడు మీదున్నా.., దేశీయంగా పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో విక్రయాల ఉధృతి మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్ 501 పాయింట్లు మేర నష్టపోయి 47,204 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లను కోల్పోయి 14,424 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆర్థిక, బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మిడ్‌సెషన్ కల్లా నష్టాలను పూడ్చుకోగలిగాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సూచీలు క్రమంగా లాభాలను ఆర్జించుకోగలిగాయి.
► హెచ్‌డీఎఫ్‌సీతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 7% లాభంతో రూ.176 వద్ద ముగిసింది.
► నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఏడు శాతం పెరిగి రూ.453 వద్ద స్థిరపడింది.
► మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల విడుదల ముందు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 4% లాభపడి రూ.579 వద్ద నిలిచింది.
నిఫ్టీ @ సిల్వర్ జూబ్లీ ...
ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గురువారం అరుదైన ఘనతను సాధించింది. 1995 బేస్ ఇయర్ ప్రతిపాదికన 1996 ఏప్రిల్ 22 తేదీన 1,107 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన నిఫ్టీ దిగ్విజయంగా 25 వసంతాలను పూర్తి చేసుకుంది. కాంపౌండెడ్‌గా ప్రతి ఏటా 11 శాతం వృద్ధి చెందుతూ గడిచిన పాతికేళ్లలో 14 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న 15 వేల మార్కును అధిగమించింది.
ఈ పాతికేళ్ల ప్రయాణంలో నిఫ్టీ ఇండెక్స్‌లో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ.., హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు మాత్రం ఈ రోజుకు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment