
ముంబై: స్టాక్ మార్కెట్ రెండోరోజూ లాభపడింది. చివర్లో ఐటీ, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 54,554 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 16,280 వద్ద ముగిసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 377 పాయింట్లు పెరిగి 54,780 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు ఎగసి 16,359 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిలను లిఖించాయి. డెల్టా వేరియంట్ కరోనా కేసుల పెరుగుదల భయాలతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.179 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.698 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 74.43 వద్ద స్థిరపడింది.
సరికొత్త రికార్డులు – లాభాల స్వీకరణ
దేశీయ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 54,461 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 16,275 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూలతలతో సూచీలు లాభాల బాటపట్టాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 377 పాయింట్లు పెరిగి 54,780 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు ఎగసి 16,359 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. సూచీలు ఆల్‌టైం హై స్థాయిలను అందుకున్న తర్వాత స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లలో ఒక్కసారిగా లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ముఖ్యంగా మెటల్ సెక్టార్లలోని చిన్న షేర్లు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మధ్య తరహా షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఫలితంగా సూచీలు రికార్డుల నుంచి వెనక్కి వచ్చాయి. చివర్లో ఐటీ, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో విక్రయాల వెల్లువ
చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ రెండున్నర శాతం, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈలోని మొత్తం 3,374 కంపెనీ షేర్లలో ఏకంగా 550 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డులను నమోదుచేసిన ఇన్వెస్టర్లు ఈ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు కూడా ఇందుకు పురిగొల్పాయి.
Comments
Please login to add a commentAdd a comment