
ముంబై: వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో చివరకు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 61,761 వద్ద నిలవగా.. నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,266 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 264 పాయింట్లు ఎగసి 62,000ను అధిగమించింది. 62,028 సమీపానికి చేరింది. చివర్లో లాభాలను వీడటంతోపాటు 109 పాయింట్లు క్షీణించి 61,655ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 18,344– 18,230 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ముందురోజు సెన్సెక్స్ 710, నిఫ్టీ 195 పాయింట్లు జంప్‌చేసిన నేపథ్యంలో రెండో సెషన్ నుంచీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు.
రియల్టీ నేలచూపు: ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ఆటో, ఫార్మా 0.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 2.75 శాతం పతనమయ్యాయి. రియల్టీ 1 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఇండస్‌ఇండ్, కోల్ ఇండియా, టీసీఎస్, యాక్సిస్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, విప్రో, ఇన్ఫీ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క యూపీఎల్, ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్ 3–1 శాతం మధ్య డీలాపడ్డాయి.
రూపాయి నేలచూపు..
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ డీలా పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 28 పైసలు క్షీణించి 82.06 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం రూపాయిని దెబ్బతీసింది. ఈక్విటీ మార్కెట్లు నీరసించడం దీనికి జత కలిసింది.