ముంబై: అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో జోరు మీదున్న బుల్స్ మంగళవారం తడబడ్డాయి. తొలి సెషన్‌లో విక్రయాల ఒత్తిడికిలోనైన స్టాక్ సూచీలు.., మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకొని ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 370 పాయింట్లు క్షీణించింది. చివరికి 21 పాయింట్ల లాభంతో 58,136 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 125 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్లు పెరిగి 17,345 దగ్గర స్థిరపడింది. సూచీలకిది ఇది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఐటీ, మెటల్, ఆర్థిక, రియల్టీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆటో, ఇంధన షేర్లు రాణించి సూచీల రికవరీకి సహకరించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.825 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.118 కోట్ల షేర్లను కొన్నారు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా చైనాల మధ్య తైవాన్ వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► తొలి త్రైమాసికంలో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గడంతో జొమాటో షేరు 20% లాభపడి రూ. 55.60 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. జొమాటోలోని మొత్తం వాటాను వదిలించుకునేందుకు ఉబెర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బ్లాక్ డీల్ ద్వారా 7.8% వాటాకు సమానమైన షేర్లను రూ.48–54 ధర శ్రేణిలో రూ.2,939 కోట్లకు విక్రయించనుందని మర్చెంట్ బ్యాంకింగ్ వర్గాల సమాచారం.
► క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో యూపీఎల్ షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.737 వద్ద స్థిరపడింది.
► హెచ్‌డీఎఫ్‌సీ మాజీ ఎండీ ఆదిత్య పురి యస్ బ్యాంక్ బోర్డులోకి రావొచ్చనే అంచనాలతో యస్ బ్యాంక్ 13% లాభపడి రూ.17.14 వద్ద క్లోజైంది.
రూపాయికి విదేశీ నిధుల దన్ను
53 పైసలు లాభంతో 78.53కు అప్
డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 53 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 53 పైసలు బలపడి, 78.53 వద్ద ముగిసింది. రూపాయికి ఇది నెల గరిష్ట స్థాయికాగా, 11 నెలల్లో ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలోపేతం కావడం ఇదే తొలిసారి. జూలై 20వ తేదీన రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 80.06ను చూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment