ఈ నెల 31తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ స్టాక్ మార్కెట్లు కోవిడ్–19 కారణంగా పలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ వెనువెంటనే కోలుకుంటూ సరికొత్త గరిష్టాలకు చేరుకుంటూ వచ్చాయి. రోలర్‌కోస్టర్ రైడ్‌ను తలపించినప్పటికీ ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 66 శాతం దూసుకెళ్లింది. వెరసి పలుమార్లు చరిత్రాత్మక గరిష్ట రికార్డులను సాధిస్తూ వచ్చింది. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయ భ్రాంతులను చేసిన కరోనా వైరస్ కారణంగా అటు ఆర్థిక వ్యవస్థలు, ఇటు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అయితే పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు తీసుకున్న చర్యలు, సహాయక ప్యాకేజీలతో ఓవైపు ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టగా.. మరోపక్క స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతూ వచ్చాయి. ఫలితంగా పలు దేశాల జీడీపీలు క్షీణత నుంచి వృద్ధి పథంవైపు అడుగులేస్తుంటే.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధిస్తూ సాగాయి. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2020 ఏప్రిల్ నుంచి చూస్తే ఏకంగా 66 శాతం జంప్‌చేసింది. వారాంతానికల్లా 49,008 పాయింట్లకు చేరింది. ఆర్థిక వ్యవస్థకు కోవిడ్–19 సవాళ్లు విసురుతున్నప్పటికీ సెన్సెక్స్ జోరుచూపుతూనే వచ్చింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచుతూ సాగింది.
ఆటుపోట్లు..
ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ల విధింపు, డిమాండ్ పడిపోవడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. కోవిడ్–19 వల్ల చెలరేగిన ఆందోళనలతో 2020 మార్చి నెలలో సెన్సెక్స్ 8,829 పాయింట్లు(23 శాతం) పతనమైంది. ఫలితంగా ఏప్రిల్ 3కల్లా సెన్సెక్స్ 27,501 పాయింట్ల దిగువకు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకుని ఈ(2021) ఫిబ్రవరి 16కల్లా 52,517 పాయింట్ల సమీపానికి చేరింది. ఇది ఆల్‌టైమ్ ‘హై’ కాగా.. కనిష్టం నుంచి చూస్తే 25,017 పాయింట్లు దూసుకెళ్లింది. గత వారాంతం వరకూ చూస్తే నికరంగా 19,540 పాయింట్లు జమ చేసుకుంది. ఇది 66 శాతంపైగా ర్యాలీకాగా.. పలుమార్లు కొత్త గరిష్టాలను చేరుకుంటూ వచ్చింది! ఇందుకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన అన్‌లాకింగ్, ఆర్థిక రికవరీ, అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు, లిక్విడిటీ వంటి అంశాలు దోహదం చేశాయి. ఇవే అంశాల నేపథ్యంలో గతేడాది నవంబర్‌కల్లా గ్లోబల్ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్ట రికార్డులను అందుకున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. వర్థమాన మార్కెట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులతో బలపడుతున్నట్లు
తెలియజేశారు.
రికార్డుల ర్యాలీ
ర్యాలీ బాటలో సాగుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 3న మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 50,000 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇందుకు ప్రధానంగా కేంద్ర బడ్జెట్ బూస్ట్‌నిచ్చింది. దీంతో ఫిబ్రవరి 8కల్లా 51,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక ఇదే నెల 15కల్లా 52,000 మార్క్‌నూ దాటేసింది. ప్రయివేటైజేషన్ తదితర సంస్కరణలతో కూడిన 2021 కేంద్ర బడ్జెట్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఇటీవల యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 2 శాతం స్థాయికి పుంజుకోవడం, డాలరు ఇండెక్స్ 92 ఎగువకు బలపడటం వంటి అంశాలతో యూఎస్, దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ అంశాలకుతోడు ఇటీవల తిరిగి దేశీయంగా కోవిడ్–19(సెకండ్ వేవ్) కేసులు పెరుగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు రెలిగేర్ బ్రోకింగ్స్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లలో ఇటీవల కొంతమేర కరెక్షన్ జరుగుతున్నట్లు తెలియజేశారు.
ఈ ఏడాది రూపాయికీ జోష్
►4 శాతం బలపడిన దేశీ కరెన్సీ
►ఇకపై ఒడిదొడుకులకు చాన్స్
►చమురు ధరలు, కోవిడ్–19 ఎఫెక్ట్
►ఫెడ్ పాలసీ ప్రభావమూ ఉంటుంది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో స్టాక్ మార్కెట్ల బాటలో దేశీ కరెన్సీ సైతం బలపడింది. డాలరుతో మారకంలో నికరంగా 4 శాతం పుంజుకుంది. 72.5 స్థాయికి చేరింది. అయితే కోవిడ్–19 దెబ్బకు ఏడాది ప్రారంభంలో 76.90 వరకూ బలహీనపడింది. ఆపై లాక్‌డౌన్ సడలింపులు, ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్‌బీఐ చర్యలు, ప్రోత్సాహకర బడ్జెట్ వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తూ వచ్చాయి. ఫలితంగా 4 శాతం లాభపడింది. 72 వరకూ ఎగసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో అంటే 2021–22లో రూపాయి సగటున 73.50–74 స్థాయిలో కదలాడే వీలున్నట్లు ఫారెక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్టంగా 70 వరకూ బలపడవచ్చని, కనిష్టంగా 76వరకూ వెనకడుగు వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
విదేశీ పెట్టుబడుల దన్ను...
కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక తిరోగమనం, ద్రవ్యలోటు ఆందోళనలు తొలి దశలో దేశీ కరెన్సీకి షాకిచ్చినప్పటికీ విదేశీ పెట్టుబడులు, ఆర్‌బీఐ విధానాలు, ఫారెక్స్ నిల్వల బలిమి వంటి అంశాలు ద్వితీయార్థం నుంచి బలాన్ని చేకూర్చినట్లు విశ్లేషకులు వివరించారు. కోవిడ్–19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, సంస్కరణలతో కూడిన బడ్జెట్, గ్లోబల్ లిక్విడిటీ వంటి అంశాలు సైతం రూపాయికి జోష్‌నిచ్చినట్లు తెలియజేశారు. ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్ మార్కెట్లలో ఏకంగా 35.22 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం ఇందుకు సహకరించింది. 2014–15 తదుపరి ఇవి అత్యధికంకావడం గమనార్హం! మరోవైపు ఈ ఏడాది ఇప్పటివరకూ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో 67.54 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) లభించడం కూడా రూపాయికి బలాన్నిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఇటీవల మళ్లీ కోవిడ్–19 కేసులు పెరుగుతుండటం, డాలరు ఇండెక్స్ పుంజుకోవడం వంటి అంశాలు రూపాయికి కొంతమేర చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఫెడరల్ రిజర్వ్ పరపతి విధానాలు, ముడిచమురు ధరలు, ఎగుమతి గణాంకాలు, యూఎస్–చైనా వాణిజ్య వివాదాలు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment