
నేడు (30న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 11,232 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,212 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. పాలసీ సమీక్షలో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. దీంతో 0-0.25 శాతం స్థాయిలో ఫెడ్ ఫండ్స్ రేట్లు కొనసాగనున్నాయి. కోవిడ్-19 కారణంగా మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు అన్నివిధాలా మద్దతిచ్చే చర్యలు చేపడతామని ఫెడ్ చైర్మన్ పావెల్ తెలియజేశారు. దీంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 0.6-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ అంశాలకుతోడు.. నేడు జులై డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
చివర్లో అమ్మకాల దెబ్బ
మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. సెన్సెక్స్ 422 పాయింట్లు పతనమై 38,071 వద్ద నిలవగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 11,203 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,884 వద్ద కనిష్టాన్నీ చేరింది. ఇక నిఫ్టీ 11,351-11,150 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,121 పాయింట్ల వద్ద, తదుపరి 11,040 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,313 పాయింట్ల వద్ద, ఆపై 11,423 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,873 పాయింట్ల వద్ద, తదుపరి 21,670 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,313 పాయింట్ల వద్ద, తదుపరి 22,550 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
అమ్మకాలవైపు..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 353 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment