ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రంగాలు తమ విజ్ఞప్తుల చిట్టాను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు రాబోయే బడ్జెట్‌లో తగు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ కోరింది. అలాగే, వాహనాలను తుక్కు కింద మార్చే స్క్రాపింగ్ ప్రక్రియకు సంబంధించి అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం ఫేమ్ 3 వంటి పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) వంటి స్కీములు ఇకపైనా కొనసాగుతాయని ఆశిస్తున్నాం. వాహనాల స్క్రాపేజీ పాలసీ అమల్లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం లేనందున, స్క్రాపింగ్ విషయంలో మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రకటించవచ్చని ఆశిస్తున్నాం. గ్రామీణ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే ఆటోమోటివ్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలకు మేలు జరుగుతుంది’ అని తెలిపారు.
విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ 2 గడువు ముగిసినందున దాని స్థానంలో ఫేమ్ 3ని అమలు చేస్తే పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుందనే ఆశలు నెలకొన్నాయి. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేంద్రం రూ.10,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా
తరుగుదల ప్రయోజనాలు కల్పించాలి: ఫాడా
వ్యక్తిగత ట్యాక్స్‌పేయర్లకు వాహనాల తరుగుదలను (డిప్రిసియేషన్) క్లెయిమ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరగడంతో పాటు వాహనాలకు డిమాండ్ పెరిగేందుకు కూడా ఇది తోడ్పడుతుందని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, ఎల్‌ఎల్‌పీ (లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్), ప్రొప్రైటరీ, భాగస్వామ్య సంస్థలకు సైతం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment