
రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి విదేశీ పీఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 1.75 శాతం వాటాను కొనుగోలు చేసిన సిల్వర్ లేక్ తాజాగా మరో 0.38 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,875 కోట్లను వెచ్చించనుంది. తద్వారా 2.13 శాతం వాటా కోసం రూ. 9,375 కోట్లను వెచ్చించనుంది. కాగా.. పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ సైతం రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు బుధవారం డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. ఇందుకు రూ. 3,675 కోట్లను జనరల్ అట్లాంటిక్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక మరోవైపు రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజం కేకేఆర్ కో సైతం రూ. 5,550 కోట్లతో 1.28 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. వెరసి రిలయన్స్ రిటైల్‌లో 4.25 శాతం వాటా విక్రయం ద్వారా ముకేశ్ అంబానీ దిగ్గజం ఆర్‌ఐఎల్ రూ. 18,600 కోట్లు సమకూర్చుకుంది. దీంతో దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.28 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా ఆర్‌ఐఎల్ రూ. 60,000-63,000 కోట్ల మధ్య సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబతున్నాయి.
షేరు అప్
రిలయన్స్ రిటైల్‌లో విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఆర్‌ఐఎల్ షేరు 0.7 శాతం పుంజుకుని రూ. 2,250 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,264 వరకూ బలపడింది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజాలు సిల్వర్ లేక్ 1.75 శాతం, కేకేఆర్ 1.28 శాతం వాటాను కైవసం చేసుకోగా... ఇందుకు 1.8 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. ఇక జనరల్ అట్లాంటిక్ సైతం రూ. 3,675 కోట్లకు 0.84 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఆర్‌ఐఎల్‌కు డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో సైతం జనరల్ అట్లాంటిక్ రూ. 6,598 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.