ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ రోజున భారీ లాభాల స్వీకరణ
సెన్సెక్స్ 1,190 పాయింట్లు క్రాష్; మళ్లీ 80వేల స్థాయి దిగువకు
24వేల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ; 361 పాయింట్లు డౌన్
ముంబై: దలాల్ స్ట్రీట్‌పై బేర్ మెరుపు దాడితో స్టాక్ సూచీలు గురువారం ఒకటిన్నర శాతం నష్టపోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు, నెలవారీ ఎక్స్‌పైరీ రోజున లాభాల స్వీకరణతో సూచీలు రెండు నెలల్లో ఒకరోజులో అతిపెద్ద పతనాన్ని చూవిచూసింది. సెన్సెక్స్ 1,190 పాయింట్లు క్షీణించి 80వేల దిగువ 79,044 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 361 పాయింట్లు కోల్పోయి 24వేల స్థాయిని కోల్పోయి 23,914 వద్ద నిలిచింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,315 పాయింట్లు, నిఫ్టీ 401 పాయింట్లు పతనమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్బణ పెరుగుదల, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ట్రంప్ టారీఫ్‌ల పెంపు హెచ్చరికలకు తోడు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఆసియాలో జపాన్, సింగపూర్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు 2% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమై రికవరీ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
∙సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఎస్‌బీఐ (0.55%) మినహా అన్ని షేర్లూ నష్టాన్ని చవిచూశాయి. అత్యధికంగా ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 3.50% – 2.50% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 2.35% అత్యధికంగా నష్టపోయింది.
→ అధిక వెయిటేజీ షేర్లు ఇన్ఫోసిస్ (–3.50%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (–2%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఎంఅండ్‌ఎం(–3.50%) నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి.
→ నష్టాల మార్కెట్లోనూ అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. అదానీ టోటల్ గ్యాస్ 16%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎనర్జీ గ్రీన్ 10%, అదానీ పవర్ 7%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2 శాతం లాభపడ్డాయి.
నష్టాలకు నాలుగు కారణాలు
అమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.
→ డిసెంబర్‌లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి∙ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.
→ అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్‌లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరిలిపోతాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.
→ దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ వారంలో వరుస మూడు రోజులు పాటు నికర కొనుగోలుదారులుగా నిలిచి ఎఫ్‌ఐఐలు తిరిగి అమ్మకాలకు పాల్పడ్డారు. గురువారం ఏకంగా రూ. 11,756 కోట్ల విలువైన షేర్లను
విక్రయించారు.
సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో ఒక్కరోజులో మార్కెట్ క్యాప్ రూ.1.21 లక్షల కోట్లు ఆవిరై రూ. 443.27 లక్షల కోట్లకు దిగివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment