న్యూఢిల్లీ: ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థలైన ఎయిరిండియా, విస్తారాలను విలీనం చేసేందుకు అనుమతుల కోసం కాంపిటీషన్ కమిషన్ ఇండియా (సీసీఐ)కి టాటా గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ), టాటా సన్స్ (టీఎస్‌పీఎల్) జాయింట్ వెంచర్ కంపెనీ అయిన టాటా సియా ఎయిర్‌లైన్స్ (టీఎస్‌ఏఎల్).. విస్తారా బ్రాండ్ కింద విమానయాన కార్యకలాపాలు సాగిస్తోంది. టీఎస్‌ఏఎల్‌లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 49 శాతం వాటాలు ఉన్నాయి.
కొన్నాళ్ల క్రితం ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. తమకు వాటాలు ఉన్న విస్తారాను కూడా అందులో విలీనం చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత డీల్ ప్రకారం విలీనానంతరం ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థల్లో టీఎస్‌పీఎల్‌కు 51 శాతం, ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటాలు ఉంటాయి. అటు ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్‌ఏషియా ఇండియా)ను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అక్టోబర్ గణాంకాల ప్రకారం ఎయిరిండియా, విస్తారా మార్కెట్ వాటా 18.3 శాతంగా (రెండింటిదీ కలిపి) ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ కూడా కలిస్తే దేశీయంగా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ మొత్తం మార్కెట్ 25.9 శాతానికి పెరుగుతుంది. తద్వారా ఎయిరిండియా భారత్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌గాను, దేశీ రూట్ల విషయానికొస్తే రెండో పెద్ద విమానయాన సంస్థ గాను నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment