టాటా–మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపునకు సంబంధించి దాఖలైన క్రాస్ అప్పీల్స్‌పై తీర్పును సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసుకుంది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టాటా గ్రూప్ చీఫ్‌గా మిస్త్రీ తొలగింపు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) పునఃనియామకం ఉత్తర్వులు, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన క్రాస్ అప్పీల్స్ గురువారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఎస్. బోపన్న, వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.
కేసు పూర్వాపరాలు ఇవీ...
2012లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసింది. తనను తొలగించడంపై ఎన్సీఎల్ఏటీని సైరస్ మిస్త్రీ ఆశ్రయించారు. ఈ కేసులో సైరస్ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.7,50,000 కోట్లు) గ్రూప్ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు సైరస్ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ, టాటా సన్స్ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్‌లూ వివాదంపై క్రాస్ అప్పీల్స్ దాఖలు చేసినట్లయ్యింది. డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ జారీ చేసిన పునఃనియామక ఉత్తర్వులపై జనవరి 10వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్పీ గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. చైర్మన్‌గా మిస్త్రీని తొలగింపు విషయంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, అలాగే కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
వాటా విలువలపైనా వివాదం
టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్‌ల మధ్య తాజా న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వాటా విలువ రూ.70,000 కోట్లు–రూ.80,000 కోట్ల మధ్య ఉంటుందని డిసెంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టుకు టాటా గ్రూప్ తెలిపింది. టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్ 29న సంబంధిత వర్గాలు తెలిపాయి.