
టాటా గ్రూప్ 4000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ఉత్పత్తుల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో పనిచేయడానికి ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏపీఎస్) ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని టాటా గ్రూప్ తెలిపింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి తెలియజేసింది. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి నేతృత్వంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ఈ డ్రైవ్‌లో ఎంపికయ్యే మహిళలు తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని కోలార్ ప్లాంట్లపై టాటా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఇదీ చదవండి: డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్‌డ్రా
ఎన్‌ఏపీఎస్‌లో దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 10, 12వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు ఎన్‌ఏటీఎస్‌కు అర్హులని కంపెనీ తెలిపింది. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారిని షాప్ ఫ్లోర్ టెక్నీషియన్లుగా నియమిస్తారు. నిర్ణీత వేతనంతో పాటు అభ్యర్థులకు వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. ఇదిలాఉండగా, త్వరలో కంపెనీలో చేరబోయే నాలుగు వేలమంది మహిళలతో టాటా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఉత్పత్తులు పెరిగి మార్కెట్ డిమాండ్ తీరుతుంది. ఫలితంగా కంపెనీ రెవెన్యూ అధికమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment