దేశంలో క్రమ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడం, వాయు కాలుష్యం పెరగడం వంటి కారణాల చేత చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే. పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కొనుగోలు చేస్తే కొన్నేళ్ల తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి రావొచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వెహికల్స్‌పై నిషేధం ఉంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం వ్యక్తిగతంగా వినియోగించే కార్లు లగ్జరి ఉత్పత్తుల కిందకి వస్తాయి. అందువల్ల ఉద్యోగస్తులకు కారు రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభించవు. అయితే కొత్తగా చేర్చిన సెక్షన్ 80ఈఈబి కింద రుణం తీసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసిన వారికి మాత్రం పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈబీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈవీ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చింది.
సెక్షన్ 80ఈఈబి కింద పన్ను మినహాయింపు పొందాలంటే..
- ఈ మినహాయింపు ప్రతి వ్యక్తికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. అంటే ఒక వ్యక్తి కొనుగోలు చేసే మొదటి ఎలక్ట్రిక్ వాహనానికి మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది.
- బ్యాంకు లేదా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థ ఎన్‌బీఎఫ్‌సి నుంచి ఎలక్ట్రిక్ వాహన కోసం రుణం పొంది ఉండాలి.
- ఏప్రిల్ 1, 2019 - మార్చి 31, 2023 మధ్య లోన్ మంజూరై ఉండాలి.
- 2020-2021 ఆర్థిక సంవత్సరం నుంచి సెక్షన్ 80ఈఈబీ కింద పన్ను ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి.
- రుణం కోసం చెల్లించే వడ్డీపై మాత్రమే రూ.1.50 లక్షల మినహాయింపు వర్తిస్తుంది.
- వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. వ్యాపార సంస్థలకు ఈ పన్ను మినహాయింపు లభించదు.
Comments
Please login to add a commentAdd a comment