న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల కంపెనీలు త్రైమాసికవారీగా చూస్తే స్థిర వృద్ధిని నమోదు చేయవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు టీసీఎస్‌తో ప్రారంభంకానున్నాయి. 10న జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు విడుదల చేయనుంది. తదుపరి విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సైతం క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి.
ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనల నేపథ్యంలోనూ ఆదాయ వృద్ధిలో నిలకడకు అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు తదితర రిస్కుల కారణంగా భవిష్యత్ ఆర్జనలపట్ల యాజమాన్య అంచనాల(గైడెన్స్)కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.
డీల్ పైప్‌లైన్, డిమాండ్ ఔట్‌లుక్ తదితరాలపై అత్యున్నత అధికారుల అభిప్రాయాలు కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాలలో పలు దిగ్గజాల పనితీరుపై యూఎస్, యూరప్‌లో కనిపిస్తున్న ఆర్థిక సవాళ్లు, ఆర్థిక మాంద్య భయాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు యూఎస్‌లో టెక్నాలజీసహా పలు రంగాల కంపెనీలు ఈ ఏడాది(2022) వేలాది ఉద్యోగులను తొలగించడం ప్రస్తావించదగ్గ అంశమని వివరించారు. అయితే మరికొంతమంది నిపుణులు మందగమన ప్రభావం దేశీ సాఫ్ట్‌వేర్ సేవలకు డిమాండును పెంచవచ్చని భావిస్తున్నారు. వ్యయ నియంత్రణల్లో భాగంగా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులకు వీలున్నదని అంచనా వేస్తున్నారు.
స్వీట్‌స్పాట్ :
సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ దేశీ ఐటీ రంగాన్ని స్వీట్‌స్పాట్‌తో పోల్చారు. గత త్రైమాసికంతో పోలిస్తే డిమాండు స్వల్పంగా క్షీణించినప్పటికీ ప్రపంచ అనిశ్చితులు ఇందుకు కారణమని పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా పరిశ్రమ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. యూఎస్ కంపెనీలు వ్యయ నియంత్రణగా ఉద్యోగ కోతలు అమలు చేస్తున్నప్పటికీ, ఇదే మరింత ఔట్‌సోర్సింగ్‌కు వీలు కల్పిస్తుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment