రియల్ ఎస‍్టేట్‌లో హైదరాబాద్ జెట్ స్పీడులో దూసుకెళ్తోంది. దేశంలోని మెట్రో సిటీస్‌ను వెనక్కి నెట్టి ముందుకెళుతోంది. అక్కడ ఇక్కడా అని కాకుండా హైదరాబాద్ నలువైపులా వందలాది రియల్‌ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో తన మార్క్‌ను చూపుతోంది. నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.
కరోనా తర్వాత బాగా పంజుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే అనువైన సమయంగా కొనుగోలు దారులు భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నగర శివారు ప్రాంతమైన తెల్లాపూర్ ఇప్పుడు రెసిడెన్షియల్ హబ్‌గా అవతరిస్తోంది. ఈ ప్రాంతంలో ఇళ్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు ఉత్సాహాం చూపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ,రామచంద్రాపురం మండల పరిధిలోని తెల్లాపూర్ ఏరియా శాటిలైట్ టౌన్‌గా ఉండేది. అయితే ఐటీ రంగం అభివృద్ధి చెందడం, నగరంలోని ఐటీ హబ్, ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉండటంతో అనేక మంది టెక్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడ స్థిరపడేందుకు మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు ఫేస్‌బుక్, డెలాయిట్, హెచ్‌ఎస్‌బీసీ, ఆప్టమ్, క్వాల్‌కామ్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, నోవార్టిస్‌ల కార్యాలయాలు తెల్లాపూర్, సమీప ప్రాంతాలలో ఉండడం రియల్ ఎస్టేట్ బూమ్‌కు మరింత ఊతం ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు లింగం పల్లి ఇప్పుడు
తెల్లాపూర్ గృహ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోందని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నట్లు రియల్టర్లు చెబుతున్నారు. ఇంతకుముందు రియల్టీ బూమ్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని, అయితే నగరంలో ఐటీ రంగం వృద్ధితో ఇది విస్తరించిందని, భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరింత రియాల్టీ అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు.
చదరపు అడుగు ఎంతంటే
ఈ తరుణంలో క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తెల్లాపూర్‌లో రియల్ బూమ్‌పై మాట్లాడుతూ... ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్లు చదరపు అడుగుకు సగటున రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1,000 చదరపు అడుగుల నుంచి 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2బీహెచ్‌కే ఇళ్ల ధర దాదాపు రూ. 1.2 కోట్లు ఖర్చవుతుండగా, 3బీహెచ్‌కే రూ. 1.5 కోట్లకు పైగా ధరలకు అమ్ముతున్నట్లు అంచనా
వెలసిన ప్రాజెక్ట్‌లు
తెల్లాపూర్ ఐటీ పరిసర ప్రాంతాల్లో ఐటీ బూమ్‌తో మై హోమ్, రాజపుష్ప, హానర్ హోమ్స్, రామ్‌కీ, వెర్టెక్స్ హోమ్స్ వంటి రియాల్టీ డెవలపర్‌లు ఇప్పటికే అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయి. అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ ఈ ప్రాంతంలో మాల్‌ను ఏర్పాటు చేస్తుండగా..మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు బిల్డర్లు ముందుకు వస్తున్నారు.
కనెక్టివిటీ బాగుంది
తెల్లా పూర్ సమీపంలో మియాపూర్ మెట్రో స్టేషన్, టీఎస్‌ఆర్‌టీసీ బస్సు సదుపాయం ఉంది. ఆ ప్రాంత నివాసితులు తక్కువ సమయంలో నగరంలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. మాదాపూర్ నుండి 15 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 30 కి.మీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 30 నిమిషాల దూరంలో ఉన్న తెల్లాపూర్ నగరంలోని అన్ని ప్రాంతాలకు మంచి రహదారి కనెక్టివిటీని కలిగి ఉంది.
ఎంఎంటీఎస్ సౌకర్యం
పెరుగుతున్న డిమాండ్ల మధ్య, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ కనెక్టివిటీని అందించాలని యోచిస్తోంది. 10 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వంటి ప్రాంతాలకు లింగంపల్లి ద్వారా చేరుకోవచ్చు, కొల్లూరు ఓఆర్‌ఆర్ ద్వారా చేరుకోవచ్చు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FoBs) నిర్మించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment