ఆటలాడేటప్పుడో, చిన్నా చితకా ప్రమాదాల్లోనో గాయాలు తగలడం సహజం. కొన్నిసార్లు కండరాలు వాచిపోయేలా, ఎముకల వరకు నొప్పి పాకేలా దెబ్బలు తాకుతుంటాయి. ఇంకొన్నిసార్లు కాళ్లు చేతులు బెణుకుతుంటాయి. నెత్తురు కనిపించని ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ఉపశమనం కోసం కాపడం పెట్టడం, మంచుముక్కలను రుద్దడం వంటివి చేస్తుంటాయి. ఈ చర్యలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్న చోట కట్టేసుకుంటే ఇట్టే నొప్పిని మాయం చేసేస్తుంది. నడుము, భుజాలు, తొడలు, మోకాళ్లు– ఇలా ఎక్కడైనా కట్టుకునేందుకు వీలుగా ఉండే బెల్ట్ వల్ల దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. ఇది కాపడంలోని వెచ్చదనాన్నీ, మంచుముక్కల్లోని చల్లదనాన్నీ అందించగలదు. వెచ్చదనం కోసం ఒక స్విచ్, చల్లదనం కోసం మరో స్విచ్ ఇందులో ఉంటాయి.
కోరుకున్న రీతిలో వీటిని ఎంపిక చేసుకుని, టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని వాడటం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఈ పరికరాన్ని ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరుతో ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 149 డాలర్లు (రూ.12,402) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment