ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ | Three companies file draft papers with Sebi to raise funds via IPOs | Sakshi
Sakshi News home page

ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ

Oct 5 2023 8:34 AM | Updated on Oct 5 2023 8:37 AM

Three companies file draft papers with Sebi to raise funds via IPOs - Sakshi

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. దీంతో తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టాయి. ఇండో ఫామ్‌ ఎక్విప్‌మెంట్, విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్, సరస్వతీ శారీ డిపో.. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణ ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిని కోరుతున్నాయి.  

ఇండో ఫామ్‌ 
ఐపీవోలో భాగంగా ఇండో ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ 1.05 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 35 లక్షల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్‌ రణ్‌బీర్‌ సింగ్‌ ఖడ్వాలియా విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పిక్‌ అండ్‌ క్యారీ క్రేన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడులుగా వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, ఎన్‌బీఎఫ్‌సీ అనుబంధ సంస్థ బరోటా ఫైనాన్స్‌కు మూలధనాన్ని సమకూర్చేందుకు సైతం వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ట్రాక్టర్లు, పిక్‌ అండ్‌ క్యారీ క్రేన్లతోపాటు ఇతర వ్యవసాయ సంబంధ పరికరాలను తయారు చేస్తోంది. 

విభోర్‌ స్టీల్‌ 
వివిధ భారీ ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో వినియోగించే స్టీల్‌ పైపులు, ట్యూబుల తయారీ, ఎగుమతుల కంపెనీ విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 66.47 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌సహా.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.  

సరస్వతీ శారీ 
మహిళా దుస్తుల టోకు మార్కెట్‌ కార్యకలాపాలు నిర్వహించే సరస్వతీ శారీ డిపో ఐపీవోలో భాగంగా 72.45 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటికి జతగా మరో 35.55 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. చీరలతోపాటు కుర్తీ, డ్రెస్‌ మెటీరియల్స్, లెహంగాలు తదితర మహిళా దుస్తుల హోల్‌సేల్‌ బిజినెస్‌నూ కంపెనీ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement