Google Impact Challenge Programme: మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ‘ఇంపాక్ట్ చాలెంజ్’ కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థలను గూగుల్ డాట్ ఓఆర్‌జీ ఎంపిక చేసింది. ఇందులో భారత్‌కు చెందిన మూడు స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి.
ఎంపికైనవి
గూగుల్‌కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్ డాట్ ఓఆర్‌జీ. భారత్ నుంచి సంహిత–సీజీఎఫ్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, స్వ తలీమ్ ఫౌండేషన్ సంయుక్తంగా 2.5 మిలియన్ డాలర్లు (రూ.18.75 కోట్లు) ఆర్థిక సాయాన్ని గూగుల్ డాట్ ఓఆర్‌జీ నుంచి అందుకోనున్నాయి. ‘‘గూగుల్ ఓఆర్‌జీ నిర్వహించిన ఇతర ఏ ఇంపాక్ట్ చాలెంజ్‌తో పోల్చినా స్పందన ఎక్కువగా ఉంది. 7,800 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంస్థలన్నీ కూడా.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్‌లో పురోగతి, ఎంర్‌ప్రెన్యుర్‌షిప్, వ్యాపారం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, మద్దతు అనే అంశాలపై దృష్టి సారించాయి’’ అని గూగుల్ డాట్ ఓఆర్‌జీ ఓ ప్రకటన విడుదల చేసింది.
మహిళలకు చేదోడు..
సంహిత సీజీఎఫ్ ‘రివైవ్ అలయన్స్’ ప్రాజెక్ట్‌కు గూగుల్ డాట్ ఓఆర్‌జీ నుంచి 8 లక్షల డాలర్ల సాయం లభించనుంది. ఈ నిధితో 10వేల మంది మహిళలకు సాయం అందించే లక్ష్యాన్ని సంహిత పెట్టుకుంది. సంప్రదాయ మార్గాల్లో రుణాలు పొందలేని మహిళలు వారి వ్యాపార అవసరాలు, డిజిటైజేషన్‌పై పెట్టుబడులకు వీలుగా వడ్డీలేని రుణాలను అందించనుంది. వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన రుణాలు ఇవి. ఇలా తిరిగి చెల్లించిన మహిళలు.. సంహిత సీజీఎఫ్ బ్యాంకింగ్, సూక్ష్మ రుణ భాగస్వాముల నుంచి మరింత సాయానికి అర్హత సాధిస్తారని ఈ ప్రకటన తెలియజేసింది.
యువతులకు ఉపాధి శిక్షణ
ప్రథమ్ ఎడ్యుకేషన్ ఒక మిలియన్ డాలర్ల సాయాన్ని పొందనుంది. దీని ద్వారా 7,000 మందికిపైగా గ్రామీణ యువతులకు బ్యూటీ, ఆరోగ్య సంరక్షణ, మెకానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో పనిచేసే విధంగా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. 300–500 గంటలపాటు శిక్షణ ఇచ్చి, నేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి అక్రెడిటేషన్ ఇప్పించనుంది. స్వ తలీమ్ ఫాండేషన్ తనకు లభించే 7 లక్షల డాలర్ల సాయంతో గ్రామీణ మహిళలు, ఆడపిల్లలకు టెక్నాలజీ పెద్దగా అవసరం లేని స్పీకర్ ఫోన్లు తదితర మార్గాల ద్వారా మ్యాథ్స్, సైన్స్, ఆర్థిక అవగాహన తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది.
- న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment