
న్యూఢిల్లీ: ఫోన్ కాంటాక్ట్స్ జాబితాలో ఉన్నవారి నుంచి కాల్ వస్తే వారి పేరు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే పేరు తెలిసేది ఎలా? కొద్ది రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ అంశంపై పరిశ్రమతో సంప్రదింపులు జరపడానికి టెలికం శాఖ నుంచి సూచన అందుకున్నట్టు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. కొన్ని నెలల్లో సంప్రదింపులు మొదలుకానున్నాయని ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా వెల్లడించారు.
ఇలాంటి ఫీచర్‌ను అమలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే ఆలోచిస్తోంది. కానీ ఇప్పుడు టెలికం శాఖ నుండి నిర్దిష్ట సూచనతో దీనికి సంబంధించిన పని త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విధానం అమలైతే కాల్ చేస్తున్న వారిని గుర్తించడంతోపాటు కచ్చితత్వం, పారదర్శకత, చట్టబద్ధత ఉంటుందన్నది ట్రాయ్ ఆలోచన. మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ తీసుకునే సమయంలో టెలికం కంపెనీలకు వినియోగదారు అందించే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల ఆధారంగా కాల్ చేస్తున్నవారి పేరు ఫోన్ స్క్రీన్ మీద దర్శనమీయనుంది.
చదవండి: వద్దురా బాబు అంటున్నా వినకుండా..