ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్‌లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
అదానీ షేర్ల పరుగు..
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్‌డీటీవీ 3.50%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment