న్యూఢిల్లీ: బీ2బీ ఈ–కామర్స్ సంస్థ ఉడాన్.. గడిచిన 12–18 నెలల్లో టెక్నాలజీ, సరఫరా వ్యవస్థతో పాటు ఇతరత్రా విభాగాలపై రూ. 4,000 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. వార్షిక ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 100 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఉడాన్ కార్యకలాపాలు ప్రారంభమై అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత మెయిల్‌లో సహ వ్యవస్థాపకులు ఆమోద్ మాలవీయ, సుజీత్ కుమార్, వైభవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.
లక్షల మంది చిన్న వ్యాపారుల సమస్యలు తీర్చేందుకు ఏర్పాటైన తమ సంస్థ.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాలకు పదును పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వారు వివరించారు. కేవలం ఈ–కామర్స్‌కే పరిమితం కాకుండా దేశీయంగా అతి పెద్ద కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదగనున్నట్లు పేర్కొన్నారు. 2016లో ఏర్పాటైన ఉడాన్ ప్లాట్‌ఫాంలో 30 లక్షల మంది పైగా యూజర్లు, 30,000 మంది పైగా విక్రేతలు ఉన్నారు. రోజూ 1.5–1.75 లక్షల ఆర్డర్లు, నెలకు 45 లక్షల పైచిలుకు ఆర్డర్లు డెలివరీ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్ల నుంచి 280 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,048 కోట్లు) అందుకుంది. దాదాపు 3 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇప్పటిదాకా సుమారు 1.15 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment