
దేశంలో ఆధార్ కార్డ్ అప్ డేట్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆధార్ సేవలకు అధిక ఛార్జీ వసూలు చేస్తున్న ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని, వారిని నియమించిన యాజమాన్యానికి రూ. 50,000 జరిమానా విధిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేసింది.
బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్‌డేట్‌తో సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు విధించకూడదని..ఇప్పటికే అన్ని ఆధార్ ఆపరేటర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
‘‘అయితే, అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడతామని, నిజమని తేలితే సంబంధిత నమోదు రిజిస్ట్రార్‌పై రూ. 50,000 జరిమానా విధిస్తాం. ఆపరేటర్‌ను సస్పెండ్ చేస్తామని’’ చంద్రశేఖర్ తెలిపారు. ఆధార్ సంబంధిత విషయాలపై ఫిర్యాదు చేయాలంటే యూఐడీఏఐ ఈమెయిల్ ద్వారా లేదంటే టోల్ ఫ్రీ నంబర్ 1947కి కాల్ చేయొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment