యూని'ఫ్లాప్' కార్న్‌లు.. బేర్‌ మంటున్న టెక్‌ స్టార్టప్‌లు! | Unicorn Tech Startups Fail in the Stock Market | Sakshi
Sakshi News home page

యూని'ఫ్లాప్' కార్న్‌లు.. బేర్‌ మంటున్న టెక్‌ స్టార్టప్‌లు!

Published Thu, Jan 27 2022 7:04 AM | Last Updated on Thu, Jan 27 2022 7:05 AM

Unicorn Tech Startups Fail in the Stock Market - Sakshi

కొద్ది నెలలుగా రిటైల్‌ ఇన్వెస్టర్లను ఊరిస్తూ భారీ లాభాలతో స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన కంపెనీలు ఉన్నట్టుండి ‘బేర్‌’మంటున్నాయి. ప్రధానంగా టెక్‌ స్టార్టప్‌లలో ఊపందుకున్న అమ్మకాలు అనూహ్య నష్టాలకు తెరతీస్తున్నాయి. వెరసి కొద్ది వారాల్లోనే కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)లో రూ. 2 లక్షల కోట్లు ఆవిరైంది. వీటిలో ప్రధానంగా గత కేలండర్‌ ఏడాది(2021)లో లిస్టయిన ఆరు టెక్‌ స్టార్టప్‌లు కోల్పోయిన విలువే రూ. 1.2 లక్షల కోట్లుకావడం గమనార్హం! 

దిగ్గజ స్టార్టప్‌లకు దెబ్బ 
2021లో ప్రైమరీ మార్కెట్లు కదంతొక్కాయి. దీంతో పలు స్టార్టప్‌లు సహా వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చాయి. ప్రధానంగా కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు లిస్టింగ్‌కు పోటీపడ్డాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు క్యూకట్టడంతో ఐటీ, సాస్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్‌ తదితర కంపెనీలు ఐపీవోల ద్వారా అనూహ్య స్థాయిలో నిధులు సమకూర్చుకున్నాయి. దీనికితోడు సెకండరీ మార్కెట్లు జోరు మీదుండటంతో భారీ లాభాలతో సైతం లిస్టయ్యాయి. అయితే గతేడాది చివర్లో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బాండ్ల కొనుగోలుకి మంగళంపాడనుండటంతోపాటు.. వడ్డీ రేట్లను వేగంగా పెంచనున్న సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు యూటర్న్‌ తీసుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

ఫలితంగా అటు సెకండరీ మార్కెట్లలో దిద్దుబాటు ప్రారంభమైంది. వెరసి లిస్టింగ్‌ తదుపరి  ఈ కేలండర్‌ ఏడాది(2022) మూడో వారానికల్లా కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో రూ. 2 లక్షల కోట్లకు చిల్లు పడింది.  ఆరు కొత్తతరం కంపెనీల ద్వారానే దీనిలో రూ. 1.2 లక్షల కోట్లమేర ఆవిరైంది. జాబితాలో  ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్‌ వెంచర్స్‌(నైకా బ్రాండ్‌), వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌), జొమాటో, పీబీ ఫిన్‌టెక్‌(పాలసీ బజార్‌), కార్‌ట్రేడ్‌ చేరాయి.  అయితే గేమింగ్‌ ఆధారిత కంపెనీ నజారా టెక్నాలజీస్‌ నష్టాల నుంచి నిలదొక్కుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! 

పేటీఎమ్‌ పతనం 
రెండు నెలల క్రితం లిస్టయిన డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌ మార్కెట్‌ విలువ తాజాగా సగానికి పడిపోయింది. ఈ నెల 24కల్లా రూ. 60,000 కోట్ల దిగువకు చేరింది. కంపెనీ షేరు ఐపీవో ధర రూ. 2,150తో పోలిస్తే రూ. 917 వరకూ జారింది. అంటే 57 శాతం పతనమైంది. ఇక 2021 నవంబర్‌ 16న 52 వారాల గరిష్టం రూ. 169ను అందుకున్న జొమాటో తాజాగా రూ. 91 వద్ద ముగిసింది. ఈ బాటలో ఆగస్ట్‌ 20న గరిష్టంగా రూ.1610ను తాకిన కార్‌ట్రేడ్‌ సోమవారానికల్లా రూ.768కు పడిపోయింది. గత నవంబర్‌ 17న  రూ. 1,470 వద్ద లైఫ్‌టైమ్‌ హై సాధించిన పాలసీబజార్‌ రూ.776కు జారింది. 

ఇదేవిధంగా నవంబర్‌ 26న రూ. 2,674కు ఎగసిన నైకా రూ. రూ.1,735కు దిగింది.  స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ షేరు రూ. 940 నుంచి రూ. 780కు నీరసించింది. అయితే రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు పెట్టుబడులున్న నజారా టెక్‌ మార్కెట్‌ విలువకు లిస్టింగ్‌ తదుపరి రూ.3,000 కోట్లమేర జమయ్యింది. అయినప్పటికీ ఈ షేరు సైతం అక్టోబర్‌ 11న రూ. 3,354ను అధిగమించగా.. తాజాగా రూ. 2,384 వరకూ క్షీణించింది.

వేల్యూ స్టాక్స్‌వైపు చూపు
కొద్ది రోజులుగా దేశీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఫండ్‌ మేనేజర్లు, తదితర ఇన్వెస్టర్లు అధిక అవకాశాలున్న గ్రోత్‌ స్టాక్స్‌ నుంచి వైదొలగుతున్నట్లు తెలియజేశారు. వీటి స్థానే ఇప్పటికే వ్యాపారాలు విస్తరించిన వేల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. యూఎస్‌ అంశాన్ని పక్కనపెడితే.. దేశీయంగా గతేడాది బుల్‌ట్రెండ్‌ కారణంగా నష్టాలలో ఉన్నప్పటికీ టెక్‌ ఆధారిత కంపెనీలైన జొమాటో, పేటీఎమ్‌ తదితర కౌంటర్లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజరీ సంస్థ క్రిస్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కేజ్రీవాల్‌ తెలియజేశారు. ప్రస్తుతం వీటి విలువలు(పీఈ) అధికంగా ఉండటంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర వేల్యూ స్టాక్స్‌వైపు చూస్తున్నట్లు ఎలారా సెక్యూరిటీస్‌ ఇండియా ఎండీ హరేంద్ర కుమార్‌ పేర్కొన్నారు.

కారణాలున్నాయ్‌... 
కొద్దిరోజులుగా సెకండరీ మార్కెట్లు కరెక్షన్‌కు లోనుకావడానికి ప్రధానంగా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, ఒమిక్రాన్‌ ఆందోళనలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే యూఎస్‌లో ఇటీవల టెక్నాలజీ కౌంటర్లలో భారీ అమ్మకాలు కొనసాగుతుండటం ఇక్కడ గమనార్హం. టెక్‌ కౌంటర్లకు ఆవాసమైన నాస్‌డాక్‌ ఇండెక్స్‌ గత నవంబర్‌ నుంచి చూస్తే దాదాపు 20 శాతం పతనంకావడాన్ని ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలంలో ఇండెక్స్‌ 20 శాతం పతనంకావడం బేర్‌ ట్రెండుకు సంకేతమని పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక విలువలుగల టెక్‌ స్టార్టప్‌ల నుంచి వైదొలగేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషించారు.

(చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement