ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్‌ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి.
టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్‌రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్‌రాకెట్‌కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది.
ఎగుమతులు అప్..
పండుగ సీజన్‌లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment