న్యూఢిల్లీ: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 2,464 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,164 కోట్లు ఆర్జించింది. పెరిగిన ముడివ్యయాలు, విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలను ప్రభావితం చేశాయి.
కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 12.5 చొప్పున నాలుగో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం, కాపర్, ఆయిల్‌గ్యాస్ కార్యకాలాపాల కోసం 91 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్, 600 మెగావాట్ల సౌర విద్యుత్‌ను పొందేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ తెలిపింది.
ఆదాయం అప్
ప్రస్తుత సమీక్షా కాలంలో వేదాంతా మొత్తం ఆదాయం రూ. 34,674 కోట్ల నుంచి రూ. 34,818 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 26,777 కోట్ల నుంచి 31,327 కోట్లకు భారీగా ఎగశాయి. 2022 జూలెలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కారణంగా రూ. 333 కోట్ల ప్రభావం పడినట్లు కంపెనీ వెల్లడించింది. జింక్ ఇంటర్నేషనల్ ఆస్తులను రూ. 2,981 కోట్ల విలువలో హిందుస్తాన్ జింక్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. క్యూ3లో తరుగుదల, అమార్టైజేషన్ పద్దు 4 శాతం పెరిగి రూ. 2,720 కోట్లుగా నమోదైంది. 2022 డిసెంబర్ 31కల్లా స్థూల రుణభారం రూ. 61,550 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం నష్టంతో రూ. 320 వద్ద ముగిసింది.
చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!
Comments
Please login to add a commentAdd a comment