
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేత దారుడు విజయ్ మాల్యాకు (64) భారీ షాక్ తగిలింది. అక్టోబర్ 5 న మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 31) ఆదేశించింది. ఆ రోజు కోర్టు గదిలో మాల్యా ఉనికిని నిర్ధారించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు కోర్టు ధిక్కారం కేసులో దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరిన మాల్యా పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.
మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను బదిలీ చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో, మే 9, 2017 ఆయనను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని మాల్యా కోరారు. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం మాల్యా పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు సమీక్ష చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 2020 అక్టోబర్ 5న మాల్యా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతేకాదు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మాల్యా హాజరుకు బాధ్యత వహించాలని తెలిపింది. కాగా 9,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడైన మాల్యా బెయిల్ మీద లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే.