వరుసగా రెండో రోజు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. డోజోన్స్ 371 పాయింట్లు(1.4 శాతం) ఎగసి 27,851కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 74 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 3,443 వద్ద ముగిసింది. నాస్‌డాక్ మరింత అధికంగా 427 పాయింట్లు(4 శాతం) దూసుకెళ్లి 11,588 వద్ద స్థిరపడింది. వెరసి ఏప్రిల్ తదుపరి ఒకే రోజు 4 శాతం లాభపడింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో స్పష్టత లోపించడం.. అటు ట్రంప్, ఇటు బైడెన్‌లకు విజయావకాశాలు సమానంగా కనిపిస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో పలు రంగాల కౌంటర్లు జోరందుకున్నాయి. రెండు వైపులా ఆధిక్యత కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా ప్రధాన విధాన నిర్ణయాలలో మార్పులు కష్టతరం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ గెలుపొందడంతో సెనేట్లో డెమొక్రాట్లకు మెజారిటీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొన్నారు.
ఫెడ్‌పై కన్ను
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు ముగియనుండటంతో నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ మళ్లీ బలపడింది. అయితే 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పతనమయ్యాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి.
ఫాంగ్ స్టాక్స్ అప్
ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో ఫేస్‌బుక్ 8.3 శాతం, అమెజాన్, అల్ఫాబెట్ 6 శాతం చొప్పున దూసుకెళ్లగా.. మైక్రోసాఫ్ట్ 5 శాతం, యాపిల్ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు రూపొందించిన ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందించడంతో బయోజెన్ షేరు 44 శాతం దూసుకెళ్లింది. ఫార్మా బ్లూచిప్స్‌లో మెర్క్ అండ్ కో 5 శాతం, ఆస్ట్రాజెనెకా 6.5 శాతం, ఫైజర్ 3 శాతం చొప్పున పెరిగాయి. ఇతర కౌంటర్లలో ఉబర్ టెక్నాలజీస్ 14.5 శాతం, లిఫ్ట్ ఇంక్ 11 శాతం చొప్పున పురోగమించాయి. డిఫెన్స్ కౌంటర్లలో నార్త్రోప్ గ్రమ్మన్ 3.6 శాతం, లాక్ హీడ్ మార్టిన్ 2.4 శాతం చొప్పున బలపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment