Bull Trend
-
యూఎస్ మార్కెట్ల దూకుడు
వరుసగా రెండో రోజు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. డోజోన్స్ 371 పాయింట్లు(1.4 శాతం) ఎగసి 27,851కు చేరగా.. ఎస్అండ్పీ 74 పాయింట్లు(2.2 శాతం) పురోగమించి 3,443 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 427 పాయింట్లు(4 శాతం) దూసుకెళ్లి 11,588 వద్ద స్థిరపడింది. వెరసి ఏప్రిల్ తదుపరి ఒకే రోజు 4 శాతం లాభపడింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో స్పష్టత లోపించడం.. అటు ట్రంప్, ఇటు బైడెన్లకు విజయావకాశాలు సమానంగా కనిపిస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో పలు రంగాల కౌంటర్లు జోరందుకున్నాయి. రెండు వైపులా ఆధిక్యత కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా ప్రధాన విధాన నిర్ణయాలలో మార్పులు కష్టతరం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ గెలుపొందడంతో సెనేట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొన్నారు. ఫెడ్‌పై కన్ను ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు నేడు ముగియనుండటంతో నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ మళ్లీ బలపడింది. అయితే 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పతనమయ్యాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఫాంగ్ స్టాక్స్ అప్ ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో ఫేస్బుక్ 8.3 శాతం, అమెజాన్, అల్ఫాబెట్ 6 శాతం చొప్పున దూసుకెళ్లగా.. మైక్రోసాఫ్ట్ 5 శాతం, యాపిల్ 4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు రూపొందించిన ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందించడంతో బయోజెన్ షేరు 44 శాతం దూసుకెళ్లింది. ఫార్మా బ్లూచిప్స్‌లో మెర్క్ అండ్ కో 5 శాతం, ఆస్ట్రాజెనెకా 6.5 శాతం, ఫైజర్ 3 శాతం చొప్పున పెరిగాయి. ఇతర కౌంటర్లలో ఉబర్ టెక్నాలజీస్ 14.5 శాతం, లిఫ్ట్ ఇంక్ 11 శాతం చొప్పున పురోగమించాయి. డిఫెన్స్ కౌంటర్లలో నార్త్రోప్ గ్రమ్మన్ 3.6 శాతం, లాక్ హీడ్ మార్టిన్ 2.4 శాతం చొప్పున బలపడ్డాయి. -
బుల్ రన్ తొలి దశలో: జున్‌జున్‌వాలా
దేశీయంగా స్టాక్ మార్కెట్లు అతిపెద్ద బుల్ రన్ ప్రారంభ దశలో ఉన్నట్లు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పేర్కొంటున్నారు. కోవిడ్-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై రాకేష్ అభిప్రాయాలను చూద్దాం.. టెస్ట్ మ్యాచ్ బుల్ మార్కెట్ అంటే క్రికెట్లో టెస్ట్ మ్యాచ్వంటిదని చెప్పవచ్చు. ఇది 50 ఓవర్లలో ముగిసే గేమ్ కాదు. అయితే బుల్ ట్రెండ్ మొదలయ్యేముందు మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవడం సాధారణం. కొత్తగా మొదలయ్యే ప్రతీ బుల్ మార్కెట్ గతంలో నమోదైన బుల్ ట్రెండ్కంటే ప్రభావవంతంగా ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణతో మార్చిలో వెల్లువెత్తిన భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో ఇక్కడినుంచి దేశీ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలుంది. పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకోనున్న సంకేతాలను ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ ప్రతిబింబిస్తోంది. లాక్‌డవున్‌ను పూర్తిగా ఎత్తివేశాక ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వ్యయప్రణాళికలు అమలు చేసే అవకాశముంది. రిస్క్ తక్కువే ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు భారీగా పతనంకాకపోవచ్చు. ఇప్పటికే ప్రారంభమై బుల్ మార్కెట్ నేపథ్యంలో కంపెనీల ఈపీఎస్‌లు, పీఈ రేషియోలు విస్తరించే వీలుంది. గత మూడు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ సమస్యలు ఎదుర్కొన్నాయి. అనవసర భయాల కారణంగా కోవిడ్-19 సంక్షోభం అధికమైనట్లు తోస్తోంది. ఇది ఒక ఫ్లూ వ్యాధి మాత్రమే. ప్లేగు లేదా క్యాన్సర్కాదు. దీర్ఘకాలంలో కోవిడ్-19 కారణంగా పెను మార్పులు కనిపించకపోవచ్చు. ప్రజలు తిరిగి ప్రయాణాలు చేయడం, రెస్టారెంట్లను సందర్శించడంవంటివి చేపడతారని చెప్పవచ్చు. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన నష్టాలపై ఒక అవగాహనకు రావడం ద్వారా ప్రభుత్వం తదుపరి దశలో తగిన చర్యలు చేపట్టే వీలుంది. కోవిడ్-19 సవాళ్ల తదుపరి పలు కంపెనీలు యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. కొన్ని కంపెనీలు వేగవంత వృద్ధిని అందుకోవచ్చు. మరికొన్ని కంపెనీలు సవాళ్లను అధిగమించడంలో మరికొంత శ్రమించవలసిరావచ్చు. అనిశ్చితి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు తలెత్తాయి. డిసెంబర్ తదుపరి మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యల వివరాలు వెల్లడయ్యే వీలుంది. దీంతో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లు అంతంత మాత్ర పనితీరునే చూపవచ్చు. ఎన్బీఎఫ్సీ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి ఏర్పడవచ్చు. అయితే హౌసింగ్ రంగానికి భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని అంచనా. పలు సంస్థలు దివాళా బాట పట్టడం ద్వారా ఫైనాన్షియల్ రంగంలో సమస్యలు పెరగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఇతర సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ కస్టమర్లు అతితక్కువగా రుణ చెల్లింపుల వాయిదాల మారటోరియంవైపు మొగ్గు చూపడం గమనించదగ్గ అంశం! -
కీలక మద్దతు శ్రేణి 20,375-20,493
బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని చేరగలిగినా, ఎన్ఎస్ఈ నిఫ్టీ తృటిలో ఆ ఛాన్స్ మిస్‌కావడం ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చే అంశం. సెన్సెక్స్‌కంటే అధికంగా ట్రేడయ్యే నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటితేనే బుల్ ట్రెండ్ బలపడే అవకాశం వుంటుంది. డెరివేటివ్ ట్రేడింగ్ పొజిషన్లు ఎక్కువగా వుండే ఈ సూచీ కొత్త రికార్డును సృష్టించివుంటే, మరిన్ని పెట్టుబడులురావడం, మరింత షార్ట్ కవరింగ్ జరగడం ద్వారా మొత్తంగా మార్కెట్ తీరే మారిపోయేది. అలాగే ఈ సూచీ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరలేకపోతున్నదని పసిగట్టిన మరుక్షణమే అటు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఇటు బేర్స్ షార్టింగ్ కార్యకలాపాలు మొదలైపోతాయి. ఇప్పుడు జరుగుతున్నదదే. నిఫ్టీ 6,343 పాయింట్ల స్థాయి (2008 జనవరి 8నాటి రికార్డుస్థాయి 6,357 పాయింట్లు) నుంచి వెనుతిరిగినంతనే విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల స్పీడు తగ్గింది. ఆక్టోబర్ నెలలో రోజుకు సగటున రూ. 1,000-1,500 కోట్ల నికర పెట్టుబడులు జరిపిన ఎఫ్ఐఐలు గతవారం సగటు కొనుగోళ్లు రూ. 500 కోట్లకే పరిమితమయ్యాయి. దేశీయ సంస్థల అమ్మకాల వేగం పెరిగింది. గత నెలలో సగటున రూ. 500 కోట్ల నికర విక్రయాలు జరిపిన ఈ సంస్థలు క్రితంవారంలో అమ్మకాల్ని రూ. 800-900 కోట్లకు పెంచాయి. అమెరికా జీడీపీ అంచనాల్ని మించి పెరగడంతో అక్కడి కేంద్ర బ్యాంక్ ఫెడ్ ఆర్థిక ఉద్దీపనపై మళ్లీ సందేహాలు తలెత్తడం మన మార్కెట్ తిరోగమనానికి కారణమని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నా, నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటి ఆపైన స్థిరపడలేకపోతే అప్‌ట్రెండ్ సాధ్యం కాదని మార్కెట్ టెక్నికల్ సెటప్ మొత్తం చెదిరిపోతుందని గత మార్కెట్ పంచాంగంలో సూచించాం. ఎందుకంటే 1995 నుంచి 2010 వరకూ ఇలా అంతక్రితపు గరిష్టస్థాయిని ఛేదించి, లేదా సమీపస్థాయికి వచ్చి సూచీలు 25-50 శాతం పతనమైన సందర్భాలు ఐదారు వున్నాయి. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే. సమీప భవిష్యత్తులో కీలకమైన మద్దతుస్థాయిల్ని స్టాక్ సూచీలు పరిరక్షించుకుంటూ గతవారపు నష్టాల నుంచి వేగంగా కోలుకోవాల్సివుంటుంది. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఇన్వెస్టర్ల అంచనాల్ని మించినందున, గత జూలై, ఆగస్టు నెలల తరహాలో ఫెడ్ ఉద్దీపన సాకుతో మార్కెట్లో అమ్మకాలు వేగవంతమైతే స్టాక్ సూచీలు పతనమయ్యే ప్రమాదం ఈ వారం పొంచివుంది. సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు నవంబర్ 8తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ అంతక్రితంవారంతో పోలిస్తే 573 పారుుంట్ల భారీ నష్టంతో 20,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం కూడా 14వ తేదీన సెలవు కారణంగా ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితమవుతుంది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 20,375-20,493 పాయింట్ల శ్రేణి వద్ద లభించబోయే మద్దతు అత్యంత కీలకం. అక్టోబర్ 15-18 తేదీల మధ్య ఇదే శ్రేణి నుంచి అధిక ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ చేయడం ద్వారా సెన్సెక్స్ 21,321 పాయింట్ల వద్దకు చేరగలిగింది. ఇలాగే సూచీ రెండు వారాల కనిష్టస్థాయి కూడా ఈ శ్రేణిలోనే వున్నది. అక్టోబర్ నెలలో జరిగిన 2,057 పాయింట్ల ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి కూడా 20,500 సమీపంలోనే వున్నది. ఇటువంటి కీలక మద్దతును ఈ వారం కోల్పోతే వేగంగా 20,050 స్థాయి వద్దకు పతనం జరగవచ్చు. ఈ స్థాయిని కూడా నష్టపోతే 19,841 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన మద్దతు శ్రేణిని సెన్సెక్స్ పరిరక్షించుకంటే వేగంగా 21,140 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే మరోదఫా 21,320 పాయింట్ల స్థాయికి చేరే ఛాన్స్ వుంటుంది. రానున్న వారాల్లో 22,498 స్థాయిని కూడా అందుకునే వీలుంటుంది. నిఫ్టీ మద్దతు శ్రేణి 6,032-6,080 గతవారపు అంచనాలకు భిన్నంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,357 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించలేకపోవడంతో నవంబర్8తో ముగిసిన వారంలో అంతక్రితంవారంతో పోలిస్తే 176 పారుుంట్ల భారీ నష్టంతో 6,140 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ జరిపినా, ఆ రోజు రాత్రి విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది. ఈ ప్రభావంతో నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే ప్రధాన మద్దతు 6,032-6,080 శ్రేణి మధ్య లభిస్తున్నది. ఈ మద్దతుశ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే వేగంగా 5,950 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 5,875 స్థాయికి పతనం కావొచ్చు. ఈ వారం ప్రధాన మద్దతుశ్రేణిని పరిరక్షించుకోగలిగితే వెనువెంటనే 6,280 స్థాయికి ర్యాలీ జరపవచ్చు. ఆపైన స్థిరపడితే 6,357 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో 6,550-6,600 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. - పి. సత్యప్రసాద్