కీలక మద్దతు శ్రేణి 20,375-20,493 | Nifty may reach 6,343points | Sakshi
Sakshi News home page

కీలక మద్దతు శ్రేణి 20,375-20,493

Published Mon, Nov 11 2013 1:49 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

Nifty may reach 6,343points

బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని చేరగలిగినా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తృటిలో ఆ ఛాన్స్ మిస్‌కావడం ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చే అంశం. సెన్సెక్స్‌కంటే అధికంగా ట్రేడయ్యే నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటితేనే బుల్ ట్రెండ్ బలపడే అవకాశం వుంటుంది.  డెరివేటివ్ ట్రేడింగ్ పొజిషన్లు ఎక్కువగా వుండే ఈ సూచీ కొత్త రికార్డును సృష్టించివుంటే, మరిన్ని పెట్టుబడులురావడం, మరింత షార్ట్ కవరింగ్ జరగడం ద్వారా మొత్తంగా మార్కెట్ తీరే మారిపోయేది. అలాగే ఈ సూచీ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరలేకపోతున్నదని పసిగట్టిన మరుక్షణమే అటు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఇటు బేర్స్ షార్టింగ్ కార్యకలాపాలు మొదలైపోతాయి. ఇప్పుడు జరుగుతున్నదదే. నిఫ్టీ 6,343 పాయింట్ల స్థాయి (2008 జనవరి 8నాటి రికార్డుస్థాయి 6,357 పాయింట్లు) నుంచి వెనుతిరిగినంతనే విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల స్పీడు తగ్గింది. ఆక్టోబర్ నెలలో రోజుకు సగటున రూ. 1,000-1,500 కోట్ల నికర పెట్టుబడులు జరిపిన ఎఫ్‌ఐఐలు గతవారం సగటు కొనుగోళ్లు రూ. 500 కోట్లకే పరిమితమయ్యాయి. దేశీయ సంస్థల అమ్మకాల వేగం పెరిగింది. గత నెలలో సగటున రూ. 500 కోట్ల నికర విక్రయాలు జరిపిన ఈ సంస్థలు క్రితంవారంలో అమ్మకాల్ని రూ. 800-900 కోట్లకు పెంచాయి.
 
 అమెరికా జీడీపీ అంచనాల్ని మించి పెరగడంతో అక్కడి కేంద్ర బ్యాంక్ ఫెడ్ ఆర్థిక ఉద్దీపనపై మళ్లీ సందేహాలు తలెత్తడం మన మార్కెట్ తిరోగమనానికి కారణమని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నా, నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని దాటి ఆపైన స్థిరపడలేకపోతే అప్‌ట్రెండ్ సాధ్యం కాదని మార్కెట్ టెక్నికల్ సెటప్ మొత్తం చెదిరిపోతుందని గత మార్కెట్ పంచాంగంలో సూచించాం. ఎందుకంటే 1995 నుంచి 2010 వరకూ ఇలా అంతక్రితపు గరిష్టస్థాయిని ఛేదించి, లేదా సమీపస్థాయికి వచ్చి సూచీలు 25-50 శాతం పతనమైన సందర్భాలు ఐదారు వున్నాయి. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే. సమీప భవిష్యత్తులో కీలకమైన మద్దతుస్థాయిల్ని స్టాక్ సూచీలు పరిరక్షించుకుంటూ గతవారపు నష్టాల నుంచి వేగంగా కోలుకోవాల్సివుంటుంది. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఇన్వెస్టర్ల అంచనాల్ని మించినందున, గత జూలై, ఆగస్టు నెలల తరహాలో ఫెడ్ ఉద్దీపన సాకుతో మార్కెట్లో అమ్మకాలు వేగవంతమైతే స్టాక్ సూచీలు పతనమయ్యే ప్రమాదం ఈ వారం పొంచివుంది.  
 
 సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
 నవంబర్ 8తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ అంతక్రితంవారంతో పోలిస్తే 573 పారుుంట్ల భారీ నష్టంతో 20,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం కూడా 14వ తేదీన సెలవు కారణంగా ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితమవుతుంది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 20,375-20,493 పాయింట్ల శ్రేణి వద్ద లభించబోయే మద్దతు అత్యంత కీలకం. అక్టోబర్ 15-18 తేదీల మధ్య ఇదే శ్రేణి నుంచి అధిక ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ చేయడం ద్వారా సెన్సెక్స్ 21,321 పాయింట్ల వద్దకు చేరగలిగింది. ఇలాగే సూచీ రెండు వారాల కనిష్టస్థాయి కూడా ఈ శ్రేణిలోనే వున్నది. అక్టోబర్ నెలలో జరిగిన 2,057 పాయింట్ల ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి కూడా 20,500 సమీపంలోనే వున్నది. ఇటువంటి కీలక మద్దతును ఈ వారం కోల్పోతే వేగంగా 20,050 స్థాయి వద్దకు పతనం జరగవచ్చు. ఈ స్థాయిని కూడా నష్టపోతే 19,841 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన మద్దతు శ్రేణిని సెన్సెక్స్ పరిరక్షించుకంటే వేగంగా  21,140 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే మరోదఫా 21,320 పాయింట్ల స్థాయికి చేరే ఛాన్స్ వుంటుంది. రానున్న వారాల్లో 22,498 స్థాయిని కూడా అందుకునే వీలుంటుంది.
 
 నిఫ్టీ మద్దతు శ్రేణి 6,032-6,080
 గతవారపు అంచనాలకు భిన్నంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,357 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించలేకపోవడంతో నవంబర్8తో ముగిసిన వారంలో అంతక్రితంవారంతో పోలిస్తే 176 పారుుంట్ల భారీ నష్టంతో 6,140 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ జరిపినా, ఆ రోజు రాత్రి విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది. ఈ ప్రభావంతో నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే ప్రధాన మద్దతు 6,032-6,080 శ్రేణి మధ్య లభిస్తున్నది. ఈ మద్దతుశ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే వేగంగా 5,950 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 5,875 స్థాయికి పతనం కావొచ్చు. ఈ వారం ప్రధాన మద్దతుశ్రేణిని పరిరక్షించుకోగలిగితే వెనువెంటనే 6,280 స్థాయికి ర్యాలీ జరపవచ్చు. ఆపైన స్థిరపడితే 6,357 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో  6,550-6,600 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.
 - పి. సత్యప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement