సాక్షి, ముంబై: సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ దాకా వ్యాపారరంగంలో ప్రత్యేకతను చాటుకున్నటాటా గ్రూపు ఈ కామర్స్ రంగంలోకి దూసుకొస్తోంది. దేశంలోనే అతి భారీ ఒప్పందానికి సిద్ధమవుతోంది. టాటా ‘సూపర్ యాప్’ లో భారీ పెట్టుబడులకు అమెరికా రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ టాటా గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. రీటైల్ ఆధిపత్యం కోసం దేశీయంగా వ్యాపార దిగ్గజాలు పోటీపడుతోంటే.. ఆయా కంపెనీల్లో భారీ విదేశీ పెట్టుబడులు విశేషంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే టాటా సూపర్ యాప్ ప్లాట్‌ఫామ్ వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడులకు వాల్‌మార్ట్ చర్చలు జరుపుతోంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద డీల్ గా నిలుస్తుందని అంచనా.
టాటా-వాల్‌మార్ట్ జాయింట్ వెంచర్‌గా ఈ యాప్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇందులో పలు విదేశీ సంస్థలు కూడా భారీ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిపాదిత లావాదేవీ ఖరారు కోసం గోల్డ్‌మన్ సాచ్స్‌ను వాల్‌మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా నియమించినట్టు సమాచారం. టాటాతో ఒప్పందం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో కూడా విక్రయాలకు అదనపు బలం వస్తుందని కంపెనీ భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు ప్రత్యర్థిగా అవతరించినుందని భావిస్తున్నారు.
ఒక కొత్త సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో సూపర్ యాప్ ద్వారా అతిపెద్ద రిటైల్ సంస్థగా అవతరించాలని భావిస్తోంది. సుమారు 50-60 బిలియన్ డాలర్లతో ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో ప్రారంభించబోయే సూపర్ యాప్ కింద వివిధ వ్యాపారాలను ఒకే ఛానల్ కిందకి తీసుకురానుంది. హెల్త్ కేర్, ఆహారం, కిరాణా సేవలు, భీమా, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్, బిల్ పేమెంట్స్ ఇలా అన్ని రకాలు సేవలను అందించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న వాల్‌మార్ట్ చర్చల్లో ఉంది. మరోవైపు టాటా , వాల్‌మార్ట్, గోల్డ్‌మన్ సాచే ఈ అంచనాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment