మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ మెసేజ్‌లకు సంబంధించి ఎన్‌క్రిప్షన్ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని బ్రేక్ చేయాలని ఒత్తిడిచేస్తే భారత్‌లో కార్యకలాపాలను రద్దు చేసేందుకైనా వెనుకాడబోదని సంస్థ తరఫు న్యాయవాది తేజస్ కరియా దిల్లీ హైకోర్టుకు తెలిపారు. వినియోగదారుల గోప్యతకు పెద్దపీటవేస్తూ మెసేజ్‌లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తున్నందునే ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని కరియా తెలిపారు.
2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనల ప్రకారం.. మెసేజింగ్ యాప్ చాట్‌లను ట్రేస్ చేసేలా, వాటిని మొదటగా ఎవరు పంపించారో గుర్తించేలా కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సప్ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్ ఇంక్ చేసిన పిటిషన్‌లను హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ధర్మాసనానికి కరియా తన వాదనలు వినిపించారు. కొత్త ఐటీ నిబంధనలు పాటించేలా వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లేలా ఒత్తిడి చేస్తే వాట్సప్ ఇండియా నుంచి వైదొలుగుతుందన్నారు. ప్రస్తుతం యూజర్లు పంపుతున్న మెసేజ్‌ల్లో ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్ట్ విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా కొన్నిమెసేజ్‌లు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిని ముందుగా ఎవరు పంపించారో తెలియేజేసేలా ప్రభుత్వ నిబంధనలున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ కోర్టులో వాట్సప్ తరఫు వాదనలు వినిపించారు.
వైరల్ అవుతున్న మెసేజ్‌లతోపాటు వ్యక్తిగతంగా, గ్రూప్‌లో షేర్ చేస్తున్న మెసేజ్‌ల మూలకర్తలను గుర్తించాలంటే సందేశాలను డీక్రిప్ట్ చేయాల్సి ఉంటుందని కరియా అన్నారు. లక్షల సందేశాలను చాలా ఏళ్లపాటు డేటాబేస్‌లో అట్టేపెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించాలని గమనించిన ధర్మాసనం..ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అని ప్రశ్నించింది. దాంతో కరియా స్పందిస్తూ ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి నియమం లేదని బదులిచ్చారు.
ఇదిలావుండగా, మతపరమైన హింస వంటి కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన కంటెంట్ ప్రసారం అవుతున్నపుడు ప్రభుత్వ నియమం చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్రం తరఫు న్యాయవాది అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. ఐటీ నిబంధనల్లో పలు అంశాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని ఇతర పిటిషన్‌ల విచారణను ఆగస్టు 14కు షెడ్యుల్ చేయాలని బెంచ్ ఆదేశించింది.
ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ని కేంద్రం ఫిబ్రవరి 25, 2021న ప్రకటించింది. ఈ నిబంధనల వల్ల ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్కువగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!
మార్చి 22న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021ని సవాలు చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లను సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కర్ణాటక, మద్రాస్, కలకత్తా, కేరళ, ముంబయి సహా వివిధ హైకోర్టుల్లో ఈ సమస్యపై అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment