ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరిస్తున్న క్రమంలో భారీగా ఉద్యోగులను చేర్చుకుంటున్నట్లు సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో మొత్తం 9000 మందిని నియమించుకున్నామని చెప్పారు. అందులో క్రూ సిబ్బంది 5000 మంది ఉన్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ..‘2023 ఆర్థిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న సంస్థ దేశీయ మార్కెట్ వాటా 2024లో 27 శాతానికి పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ వాటా 21 శాతం నుంచి 24 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ కార్యకలాపాలు పెరగనున్నాయి. గడిచిన రెండేళ్లలో 9000 మందిని నియమించకున్నాం. అందులో 5000 వేలమంది క్రూ సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సగటు వయసు 54 సంవత్సరాల నుంచి 35 ఏళ్లకు తగ్గింది. సంస్థ ఐదేళ్ల ప్రణాళిక కోసం ప్రారంభించిన ‘విహాన్.ఏఐ’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 25 శాతం మెరుగుపడింది. నష్టం 50 శాతానికి పైగా తగ్గింది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!
‘67 నేరోబాడీ కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల క్యాబిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. 2025 మధ్యకాలం నాటికి సంస్థకు చెందిన ఇరుకైన బాడీ కలిగిన విమానాలను విశాలంగా మారుస్తాం. అందుకోసం ప్రతినెల మూడు నుంచి నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎంచుకోబుతున్నాం’ అని పేర్కొన్నారు. వినియోగదార్లలో విశ్వాసం పెంచేందుకు, కచ్చితమైన సమయపాలనపైనా దృష్టి సారించేందుకు 2022లో ఎయిరిండియా ‘విహాన్.ఏఐ’ను ఆవిష్కరించింది. చట్టపరమైన చిక్కులను తొలగించడంపై ఇది దృష్టి సారించింది. టేకాఫ్ దశలో భాగంగా పలు చర్యలను తీసుకుంటోంది. దీనిసాయంతో టాటా గ్రూప్ ఎయిర్‌ఫ్లీట్ నెట్‌వర్క్‌లో మార్పులు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment