పుచ్చకాయలివ్వండి..కొత్త ఇల్లు సొంతం చేసుకోండి! | Why Real estate firms accepting watermelons wheat in China | Sakshi
Sakshi News home page

పుచ్చకాయలివ్వండి..కొత్త ఇల్లు సొంతం చేసుకోండి!

Published Tue, Jul 5 2022 12:01 PM | Last Updated on Tue, Jul 5 2022 12:15 PM

Why Real estate firms accepting watermelons wheat in China - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌-రష్యా యుద్దం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంతో అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా చైనాలో భారీ ఉద్యోగాలను అందించే రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోవటం ఆందోళనకు దారి తీసింది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు  కొత్త ఆఫర్లను ఆందిస్తున్నారు. పుచ్చకాయలు, పీచెస్‌ పళ్లు, వెల్లుల్లి, గోధుమలులాంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు  తక్కువ రేటుకే ఇళ్లను  విక్రయిస్తున్నారు.

ఒకవైపు కొనుగోలుదారులేక, మరోవైపు ఇప్పటికే గృహాలను కొనుగోలుచేసిన వారు డబ్బులు చెల్లించక పోవడంతో ప్రాపర్టీ  వలపర్లను  కష్టాల్లోకి నెట్టేసింది.  దీంతో పుచ్చకాయలు, పీచెస్,  వెల్లుల్లి, గోధుమలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను స్వీకరిస్తున్నారని స్థానిక మీడియా నివేదించింది.  కస్టమర్ల నుంచి డబ్బులకు బదులు పుచ్చకాయలు, గోధుమలు,  వెల్లుల్లి వంటి వాటిని అంగీకరిస్తున్నారు. టైర్ 3, 4 నగరాల్లోని రియల్టర్లు ఈ విధంగా ప్రాపర్టీ కొనుగోళ్లలో రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 


 
చైనా హౌసింగ్ మార్కెట్ మందగమనానికి తోడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు బిల్డర్లు డిపాజిట్లు తీసుకోవడంపై ప్రభుత్వ నిషేధం విధించింది.  దీంతో తూర్పు నగరమైన నాన్‌ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారట. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్  పీచెస్ పళ్లను  తీసుకుంటున్నట్లు  నివేదికల ద్వారా తెలుస్తోంది. 

దీంతో సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్‌ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు. కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా, క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్‌మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంతో అమ్మకాలు పెరిగాయట. 

మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది.  చైనాలో దాదాపు 27 శాతం బ్యాంకు రుణాలు రియల్ ఎస్టేట్‌తో ముడిపడి ఉన్నాయని థింక్ ట్యాంక్, పాలసీ రీసెర్చ్ గ్రూప్ నివేదించింది. కాగా అధికారిక డేటా ప్రకారం చైనాలో గృహ విక్రయాలు వరుసగా 11 నెలలోనూ క్షీణతను నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే మేలో 31.5 శాతం తగ్గాయి. కోవిడ్‌ మహమ్మారి విలయంతో  చైనాతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు  కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి.  దీనికి  తోడు ఉక్రెయిన్‌-రష్యా వార్‌   తోడవ్వడంతో గ్లోబల్‌గా నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్‌ ధరలు మండిపోతున్నాయి. తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement