
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్‌బోర్డ్ చేశామని పేర్కొంది.
టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్‌జీఏలను (ఫ్రెషర్స్) ఆన్‌బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్‌జీఏలను ఆన్‌బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.
విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది.