న్యూఢిల్లీ: రక్షణ రంగ శిక్షణా సంబంధ సొల్యూషన్స్ కంపెనీ జెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 6 రెట్లు దూసుకెళ్లి రూ. 47 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 7.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 3 రెట్లుపైగా ఎగసి రూ. 132 కోట్లను దాటింది.
గత క్యూ1లో రూ. 37 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. సిమ్యులేషన్ ఎగుమతుల విజయవంత నిర్వహణ, దేశీయంగా యాంటీడ్రోన్ ఆర్డర్లు వంటి అంశాలు ప్రోత్సాహకర పనితీరుకు దోహదపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అశోక్ అట్లూరి పేర్కొన్నారు. కంపెనీ మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,000 కోట్లుకాగా.. వీటిలో రూ. 202 కోట్లు క్యూ1లో సాధించినట్లు వెల్లడించారు. ఈ బాటలో జులైలో మరో రూ. 500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలియజేశారు.
ఫలితాల నేపథ్యంలో జెన్ టెక్నాలజీస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 675 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment