న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో డిసెంబర్ క్వార్టర్‌లో తన పనితీరును మరింత బలోపేతం చేసుకుంది. రూ.138 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.347 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2485 కోట్ల నుంచి 35 శాతం వృద్ధితో రూ.3,383 కోట్లకు దూసుకువెళ్లింది.
డిసెంబర్ త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) తిరిగి 25 శాతం వృద్ధిలోకి వచ్చినట్టు జొమాటో ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ రూపంలో తెలిపారు. వార్షికంగా జీవోవీ 20 శాతానికి పైనే వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం, అంచనాకు మించి మార్కెట్ వాటా సొంతం చేసుకోవడంపై జీవోవీ మరింత వృద్ధి ఆధారపడి ఉంటుందని వివరించారు.
క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ జీవోవీ 103 శాతం పెరిగి రూ.3,542 కోట్లకు చేరింది. బ్లింకిట్ నష్టాలు రూ.56 కోట్లకు పరిమితమయ్యాయి. ఫుడ్ డెలివరీ జొమాటో వరకే చూస్తే ఆదాయం రూ.1,565 కోట్ల నుంచి రూ.2,025 కోట్లకు పెరిగింది. క్విక్ కామర్స్ ఆదాయం రూ.301 కోట్ల నుంచి రూ.644 కోట్లకు వృద్ధి చెందింది. రెస్టారెంట్లకు గ్రోసరీని సరఫరా చేసే హైపర్‌ప్యూర్ విభాగం ఆదాయం రూ.421 కోట్ల నుంచి రూ.859 కోట్లకు చేరింది. మెరుగైన ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జొమాటో షేరు 4 శాతానికి పైగా లాభపడి రూ.149 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment