
జిల్లా అధికారులతో మాట్లాడుతున్న అబ్జర్వర్లు
చిత్తూరు కలెక్టరేట్ : పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, కోన శశిధర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఆర్‌ఓ, కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ రిశాంత్‌రెడ్డితో సమావేశం నిర్వహించారు. అబ్జర్వర్లు మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌ఓ మాట్లాడుతూ పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ పరిశీలనకు మండలస్థాయిలో ప్రత్యేక టీమ్‌లను నియమించినట్లు చెప్పారు. ఎస్పీ రిశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసమైన బందోబస్తు కల్పిస్తున్నామని వెల్లడించారు.
ప్రశాంత వాతావరణంలో..
ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఆరు జిల్లాల పరిధిలో 3లక్షల 83 వేల మంది ఓటర్లు ఉంటారని, పోలింగ్ నిర్వహణకు గానూ 320 పోలింగ్ స్టేషన్లు, 133 అదనపు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దాదాపు 27 వేల మంది ఓటర్లు ఉన్నారని, 170 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆరు జిల్లాలలోని కలెక్టర్లు, డీఆర్‌ఓలు, ఆర్డీఓలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైనట్లు వెల్లడించారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిందని, 27వ తేదీన తుది జాబితా ప్రకటించనున్నట్లు చెప్పారు. 2వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.