పుంగనూరులో పరిశ్రమల కారిడార్ కనుమరుగు?
సందిగ్ధంలో జర్మన్ బస్సుల తయారీ ఫ్యాక్టరీ
ప్రశ్నార్థకంగా గ్రానైట్, ఫీడ్ కంపెనీలు
టీడీపీ నేతల ఆగడాలే కారణం
దెబ్బతింటున్న ప్రశాంత వాతావరణం
పునరాలోచనలో పడిన పరిశ్రమల యాజమాన్యం
అప్రతిష్ట మూటగట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం
‘కరువుకు మారుపేరైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలి. డొక్కలు మాడ్చుకుని ఊరుగాని ఊరు వెళుతున్న నిరుపేదల వలసలను నివారించాలి. స్థానికంగానే ఉపాధి కల్పించి చేయూతనందించాలి..’ అనే సదుద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పుంగనూరు వేదికగా పరిశ్రమల కారిడార్ తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్, గ్రానైట్, ఫీడ్ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహారశైలితో ఆయా కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతల దమనకాండతో ఆయా పరిశ్రమల స్థాపన సందిగ్ధంలో పడింది. వేలాది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భవితకు ఆశనిపాతమైంది.
పుంగనూరు: స్థానికంగా పదివేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి కల్పించే జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమ పుంగనూరు ప్రాంతం నుంచి తరలిపోనుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతంలో నిరుద్యోగం, వలసల నివారణకు పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో రూ.4.640 కోట్లతో 800 ఎకరాలలో బస్సుల పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు గత ఏడాది అనుమతులు కూడా మంజూరు చేసింది. అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, కంపెనీ సీఈఓ ఆండ్రియస్ హేగర్‌తో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు.
ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ పరిశ్రమ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదట అతి పెద్ద భారీ పరిశ్రమగా నిలవనుందని స్థానికులు కలలుగన్నారు. ఈ ప్రాంత వాసులు తమ బతుకులు మారుతాయని, బిడ్డల భవిష్యత్ బాగుంటుందని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్లు కూడా నిలవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ ఏర్పాటు ఆశలపై నీరుచల్లినట్టయ్యింది. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అలజడులు, అల్లర్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు యాజమాన్యం పునరాలోచనలో పడింది.
నాటి నుంచి అడ్డంకులే
పుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కక్షగట్టారు. ఈ విభేదాలతోనే ఇన్నేళ్లుగా వారు అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా పుంగనూరులో ఊహించని అభివృద్ధి జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది.
గతంలో ఎప్పుడూ అల్లర్లు లేవు
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి నుంచి పుంగనూరులో అల్లర్లు జరగలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఇలాంటి ప్రశాంతత కలిగిన పుంగనూరులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.
కంపెనీలు వెనక్కే!
పుంగనూరు మండలంలో సుమారు 20 వేల ఎకరాలలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్ పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. అలాగే జర్మన్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రానైట్ పరిశ్రమ, ఫీడ్ పరిశ్రమతో పాటు మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కసారిగా అధికార పార్టీ చేష్టలకు పరిశ్రమల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ప్రశాంతత లేని ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కష్టతరమేనని భావించి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఆగడాలే కారణం
కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుంగనూరులో పుష్కలమైన వనరులు లభిస్తాయని జర్మన్ కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బస్సుల కంపెనీని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి తరుణంలో టీడీపీ అఽధికారం చేపట్టింది. పరిశ్రమ స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అండతో ఆ పార్టీ శ్రేణులు అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి నియోజకవర్గంలో తిరగరాదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పుంగనూరు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. టీడీపీ నేతల ఆగడాలకు ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలతో బస్సుల కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం వెనకడుగు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment