కూలి పనికెళ్లి.. తిరిగిరాని లోకాలకు
● చింతచెట్టు నుంచి పడి వ్యక్తి మృతి
చౌడేపల్లె : కూలి పనుల కోసం చింతకాయలు కోసేందుకు వెళ్లిన గంగాధర్ (32) తిరిగిరానిలోకాలకు వెళ్లిన ఘటన శనివారం సింగిరివారిపల్లె సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు.. బండమీదపల్లెకు చెందిన గంగాధర్ అతని భార్య శిరీషతో పాటు ఆ గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి దిగువపల్లె పంచాయతీ సింగిరివారిపల్లె వద్దకు చింతకాయలు కోసేందుకు ఆటోలో కూలీకి వెళ్లారు. చెట్టు ఎక్కి చింతకాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు గంగాధర్ చెట్టుపై నుంచి జారి కింద పడ్డాడు. గమనించిన భార్య శిరీష, సహచర కూలీలు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment