సర్వర్ సమస్య..సహనానికి పరీక్ష!
తిరుపతి తుడా: దివ్యాంగులకు ప్రభుత్వం మరో మారు పరీక్ష పెడుతోంది. వైకల్యంతో అవస్థలు పడుతున్నారనే కనికరం కూడా లేకుండా వేధిస్తోంది. పింఛన్ సొమ్ముతో పొట్ట పోసుకొనే వారి ఆత్మాభిమానం పై దాడి చేస్తోంది. పింఛన్‌దారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యుల చేత సదరం సర్టిఫికెట్లను పొంది వారికి మరోమారు పరీక్ష పెడుతోంది. గడిచిన నెల రోజులుగా వారంలో తొలి మూడు రోజులు సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ నిర్వహిస్తోంది. వ్యయ ప్రయాసలకోర్చి మరోమారు తమ వైకల్యాన్ని నిరూపించుకునేందుకు లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుపతి రుయా ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది.
వసతుల ఏర్పాట్లలో నిర్లక్ష్యం
సదరం ఫ్రీ వెరిఫికేషన్ కోసం రోజుకు 150 నుంచి 200 మంది దివ్యాంగులు రుయా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే దివ్యాంగులకు కనీస వసతులను కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. సదరం రీ వెరిఫికేషన్ క్యాంపుల పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. ఆ శాఖ అధికారులు ఆటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక షామియానా, 20 కుర్చీలు వేసి చేతులు గెలుపుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దివ్యాంగులు అక్కడే ఉండాల్సి వస్తోంది. కనీసం తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి విధులు కోసం వచ్చిన డాక్టర్ల పట్ల కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారికి వసతి, ట్రాన్స్‌ఫోర్ట్, భోజన సౌకర్యాలను కల్పించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది.
గంటల తరబడి నిరీక్షణ
సదరం వెరిఫికేషన్ కోసం వచ్చిన దివ్యాంగులకు నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని సమయాల్లో సర్వర్ మొరాయిస్తుండడంతో రీ వెరిఫికేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. సౌకర్యాల లేమి, నిరీక్షణతో మరింత వేదనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment