నిందితుడి అరెస్ట్‌కు డిమాండ్
పుంగనూరు : మండలంలోని వనమలదిన్నె పంచాయతీ అప్పిగానిపల్లెలో చిన్నమ్మ అనే మహిళను కులం పేరుతో దూషించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మాల మహానాడు, మాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు అంబేడ్కర్ కూడలిలో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ మేకంజామనపల్లెకి చెందిన నిందితుడు రాజానాయుడుపై పోలీసులు తూతూమంత్రంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు ఎన్.అశోక్, శ్రీనివాసులు, జేవీ నాగరాజారెడ్డి, ఆనంద, ఆంజప్ప, వెంకటరమణ పాల్గొన్నారు.
చెరువులో పడి రైతు మృతి
తవణంపల్లె : మండలంలోని తెల్లగుండ్లపల్లెలో పాడి ఆవును చెరువులో కడుగుతూ అదుపుతప్పి పడిపోయి రైతు మృతి చెందినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. వివరాలు.. గ్రామానికి చెందిన అన్నదమ్ములు లోకనాథనాయుడు(46), ప్రభాకర్‌నాయుడు తమ పశువులను కడిగేందుకు చెరువుకు సోమవారం తీసుకెళ్లారు.. ప్రభాకర్‌నాయుడు పశువును కడిగి ఇంటికి వెళ్లిపోయాడు. లోకనాథనాయుడు ఆవును కడుగుతుండగా అది చెరువు మధ్యలోకి వెళ్లింది. ఆవును పట్టుకొనే క్రమంలో నీటిలో మునిగి మరణించాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య వరకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
పుంగనూరు : సారా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. మండలంలోని నల్లగుట్లపల్లెతాండాకు చెందిన గిరిబాబు సారా తరలిస్తుండగా నల్లగట్లపల్లితాండా సమీపంలో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
నిందితుడి అరెస్ట్‌కు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment